ఆకులో ఆకునై  

Posted by దైవానిక

నిన్న టీవి చూస్తున్నప్పుడు ఏదొ పి.సుశీల గారి సింగపూర్ కంసర్ట్ గురించి వస్తుంది. నాకప్పుడు వెంటనే రెండు పాటలు గుర్తొచ్చాయి.
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా!
నా అందచందములు దాచితినీకై రావేలా! (సంఘం సినిమాలోది)

ఆకులో ఆకునై పువ్వులో పువ్వు నై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై .. (మేఘ సందేశం సినిమాలోది)

వెంటనే youtube లో వెతికాను. మొదటిది కనిపించలేదు.. రెండోది కనపడ్డది. వింటూంటే అర్థం గురించి భావం గురించి ఆలోచిస్తే...

ఆకులో ఆకునై పువ్వులో పువ్వు నై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ..
ఎటులయినా ఇచటనే ఆగిపోనా

అబ్బా ఈ ఆడవి ఎంత బాగుంది. ఏ ఆకునో , పువ్వునో, కొమ్మనో లేక Atleast రెమ్మనొ అయ్యి ఈ ఆడవిలో కలసిపోతె ఎంత బాగుండును. ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు.

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరి చేడె చిన్నారి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ..

ఎటులయినా ఇచటనే ఆగిపోనా
(చేడె = కాంత)

ఈ ఆడవిలో గలగల మని వీస్తున్న చల్ల గాలిలో కెరటాన్నొ ( నీరు గలగలా పారుతుందేమో, అలాగే సముద్రములో కదా అలలుండేది) లేక జలజల మంటున్న సెలయేట్లో స్వఛ్ఛతనో , అల్లదిగో అక్కడ పగడపు రంగులో ఉన్న లేత చిగురు కింద తుమ్మెదుంది కదా అదయినా బాగుండును. ఇప్పుడే పూసిందనుకుంటాను పువ్వు, అప్పుడే యవ్వనంలోకి వచ్చిన కాంత లాగా సిగ్గు పడుతుంది.. కనీసం ఆ సిగ్గునయినా బాగుండును ఈ ఆడవిలో కలసి పోవచ్చును. అప్పుడు హాపీగా ఇక్కడే ఉండొచ్చు.

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరళి వెర్రినై ఏకతమా తిరుగాడా

(చదలు = ఆకాశం, జలదము = మేఘం, తరళి = అడవి అనుకుంటాను)
మెల్లగా ఆ చెట్లెక్కి , ఆ తరువాత అల్లదుగో ఆ కొండెక్కి, పనిలొ పనిగా ఆకాశానికి ఎక్కేసి, అక్కడ నీలంగా మేఘం కనపడుతుందే ఆ మేఘపు నీలి ప్రకాశాన్నైతే నా సామి రంగా...
ఇక ఆకలిదప్పులులేక , చీకు చింతా లేక ఈ ఆడవిలోనే పిచ్చోన్నై ఎంచక్కా ఒంటరిగా తిరిగేస్తాను..

ఇప్పుడు చూడండీ పాట ఇక్కడ. ఈ పాట వ్రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

జీవనతరంగాలు (కొత్తపాళి గారి కథావిషయం)  

Posted by దైవానిక

కోత్తపాళి గారి కథావిషయం ఆదారంగా వ్రాసిన కథ.
_________________________________


మయూర్ ట్రైన్ ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. మనిషి అక్కడున్నాడన్న మాటే గాని మనస్సెక్కడో ఉంది. తను ఇంటికి వెళ్తున్నాడు, పెళ్ళిచూపులకి. వాళ్ళ అమ్మా నాన్న పోరు పడలేక పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడొ లేదొ, ఒక అరడజను పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారు. ఎందుకో మొదటినుంచి అతనకి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. ఇవ్వాళ జరిగిన దాన్ని తలచుకుంటే, తన నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. ట్రైను కదిలింది. మెల్లాగా వెనక్కి ఒరిగాడు. అతనికి తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి.

ఇంటికి వెళ్తానికి మయూర్ ఆఫీసులో బయలు దేరాడు. రోడ్డు మీదకు వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుంటే, ఒక ఆటొవాడు అతని మీదకు వచ్చి ఆపాడు. సడన్ గా వెనక్కి జరిగడంతో ఆటో కి అతని కాలి వేలికి మధ్యలో ఒక అంగులం గాప్ మిగిలింది.
"ఎంటి బాబు ఆ తోలడం, ఆటో అనుకున్నావా లేక విమానమనుకున్నావా?" అన్నాడు అందులో కూర్చున్న వ్యక్తి.
మయూర్ కి ఇదంతా అలవాటే. అందుకే అతని సిక్స్త్ సెన్స్ వెనక్కి వేళ్ళమని చెప్పింది. పాపం ఆటోలో కూర్చున్న వ్యక్తి ఎప్పుడు ఆటో ఎక్కలేదనుకుంటా. అతని బిత్తర చూపులు చూస్తుంటేనే అర్థం అయ్యింది.

ఆటో కదిలి కాస్త దూరం వేళ్ళి ఆగింది. అది లేబర్ కాలని. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు.
"అన్న టషన్ కి వత్తవా?" అన్నది కాస్త పెద్దగా వున్నావిడ.
"ఉ"
"ఎంతయితది?"
"ఒక్కొక్కళ్ళకి ఏడు రుపాల్"
" అయిదు తీసుకోరాదు?"
" అమ్మా ఈడ బేరాలుండవు.. ఎక్కుతె ఎక్కు లేకుంటే లే"
" గట్ల గురాయిస్తవేందన్న? ఎక్కు బిడ్డా."
చిన్నావిడకి పట్టుమని 14 ఏళ్ళుకూడా ఉండవు. పేద్దావిడకి ఒక 35 ఉంటాయనుకుంటా. ఇద్దరు ఆటో ఎక్కి కూర్చున్నారు. ఆటో కదలబోతుంటే ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆటో ఆపి ఎక్కాడు. పల్లెటూరు వాడిలా ఉన్నాడు.
ఆటో తమ్మి మళ్ళి గాలిలో వెళ్ళడం మొదలెట్టాడు. ఆ పెద్దావిడ ఎదో మాట కలపబోతుంటే చటుక్కున తల తిప్పేసుకున్నాడు మొదటి నుంచి కూర్చున్న పెద్దమనిషి. ఇక చేసేది లేక ఆవిడ మయూర్ తో బాతాఖాని మొదలెట్టింది.
" తమ్మి మీది హైద్రాబాదేనా"
"అవునండి"
"మాది చింతకాని. ఈడ నుంచి టేషన్ కు ఎంతసేపు పడతది?"
"ఇంకోక పావు గంట నుంచి - అరగంట దాకా పట్టోచ్చునండి."
"ఈడ మా సెల్లి ఉంది. దానికి ఆరుగురు బిడ్డల తర్వాత కొడుకు బుట్టిండు. చూడనీకి వచ్చినా"
"ఆరుగురు ఆడపిల్లలా???"
" అవును తమ్మి .. మళ్ళా కొడుకుండాల కదా"
"దేనికి"
"అదేంది తమ్మి గట్లంటవు... తర్వాత అన్ని చూసేడిది ఆడె గదా"
" ఏంది చుసేడిది... మన సావా?" అన్నాడు ఇప్పటిదాకా వింటున్న పల్లెటూరాయన. అతని కళ్ళలో కోపం ఉట్టి పడుతూంది.
"గదేందన్నా కన్న కోడుకు సావెందుకుచూస్తడు"
"ఈ కోడుకులకు కావల్సింది ఆస్తులు గాని మనుషులు గాదమ్మ. నేను కూడ నీ తిరుగనే ఆలొచించేటోన్ని. నాకు ఇద్దరు బిడ్డలు,ఒక్క కోడుకు. బిడ్డలకిస్తే పాపం కోడుక్కి ఆస్తి మిగల్దని వాళ్ళని ఊరికనే దారిన బోయేటోల్లకి ఇచ్చి పెండ్లి జేసినా.. ఉన్నదంతా కోడుక్కి ఇస్తే ఆడేమి చేసినడొ ఎరుకనా"
"ఎం చేసినాడన్నా?"
"ఉన్న రెండెకరాలు వాడి పేరున రాయించి, ఇంట్లకెళ్ళి బయటకు గెంటిండు. ఏడకి పోయేడిది లేక కూతురు కాడ చేరినా.. పాపం బిడ్డల పరిస్థితి గంతంతగనే ఉన్నది"
మయూర్ కి అతన్ని చూస్తే జాలేసింది. ఇంతలో ఆవిడే మళ్ళా మాట్లాడింది.
" అన్న ఇప్పుడు ఏడికి పోతున్నవ్?"
" నా కోడుకు తో తగాదా చేసెటీనికి. ఆ రెండెకరాలు ముగ్గురు సమానంగా కావాలి అని ఆడిగేదానికి. లేకుంటే కోర్టుకి పోతా.."
అప్పటి దాకా ఒక మూల నుంచి అంతా వింటున్నాయన ఒక్కసారిగా బోరున ఏడ్చాడు.
"అయ్యొ బిడ్డా" అని పక్కన చేరి ఓదార్చడానికి చటుక్కున వేళ్ళింది ఆ పెద్దావిడ.
మయూర్ , "ఏమయ్యింది సర్? ఎందుకు ఏడుస్తున్నారు?"
" ఆ పెద్దాయన తన కోడుకు గురించి చెప్తుంటే నాకు ఎందుకో మా అమ్మ గుర్తోచ్చింది"
"అయ్యొ, ఏడ్వడం ఎందుకు, మీ అమ్మ ఏడుండది?" అన్నది ఆ పెద్దావిడ.
"చచ్చిపోయింది.. కాని నేను మా అమ్మ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. చిన్నాప్పుడె మా నాన్న చనిపోతే, నన్ను ఎంతో కష్టపడి పెంచింది మా అమ్మ. చుట్టాలు, పక్కాలు ఎవ్వరు మమ్మల్ని ఆదుకోలేదు. అయినా మా అమ్మ ఎప్పుడు దిగులు పడలేదు. నన్ను ఇంజినేరింగ్ దాకా చదివించింది. "
" తరువాత?" అడిగాడు మయూర్.
"తరువాత నేను అమెరికా వెళ్తాను అన్నాను. మా అమ్మ వారించింది. ఇక్కడె ఉండమంది. అక్కడికి వెళ్తె ఇక నాతో చెల్లంది. నేను ఏమయినా వెళ్తానన్నాను. తరువాత మా అమ్మే సర్దుకుంటదిలే అనుకున్నాను. కాని నాతో మళ్ళా మాట్లాడలేదు. నేను కూడా ముసల్దానికి వయసయితె తిక్క కుదిరిద్దిలే అని పట్టించుకోలేదు." అంటూ మళ్ళా కళ్ళు తుడుచుకున్నాడు.

"కాని మా అమ్మ నన్ను మళ్ళి ఎప్పుడు మాట్లాడించలేదు. కనీసం తన ఆఖరు క్షణాల్లో కూడా చూసే అవకాశం కలగలేదు. నేను మా అమ్మ మాట కోసం ఇప్పుడు తిరిగొచ్చేసాను. నేను సంపాదించిందంతా పెట్టినా మా అమ్మని తిరిగి పోందలేను. అందుకే నా ఆస్తంతా పెట్టి మా అమ్మ పేరున ఒక చారిటబుల్ ఇంస్టిట్యుట్ మొదలెట్టాను. ఆ పని మీదే ఊరెళ్తున్నాను"
కథ విని అంతా గమ్మున కూర్చున్నారు. అంతలో ఆ చిన్నావిడ అంది,
" అమ్మ నేను కూడా గా తాగుబోతోన్ని పెళ్ళీ చేసుకోను"
"మన కులం లో తాగనోడు ఎవడు బిడ్డా? అయునా పెండ్లి చేసుకోక ఏమి చేస్తవ్?"
"మంచిగా చదువుకోని మిమ్మల్నందరిని బాగా చూసుకుంటా"
"చదవినీకి మన దగ్గర ఏమున్నది బిడ్డా? "
"అమ్మా మీకు అభ్యంతరం లేకపోతె మీ బిడ్డని నేను చదివిస్తా" అన్నాడు ఆ పెద్దమనిషి.
"నేను ఒప్పుకున్నా నా పెన్విటి ఒప్పుకోడు తమ్మి.."

అంతలో స్టేషన్ వచ్చింది. అందరు దిగారు. ఎవ్వరి దారిలో వారు బయలుదేరారు.
***************** సమాప్తం****************

శ్రీరామ నవమి శుభాకాంక్షలు  

Posted by దైవానిక

బ్లాగు సోదరులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ భద్రాద్రి రాముని కరుణ మీ పయిన ఉండాలని ప్రార్థిస్తూ...

శ్రీ రామ రామ రామేతి , రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం, రామ నామ వరాననే



ఈ రోజు పానకం , వడపప్పు చేసుకోవడం మర్చిపోకండే.. అవి ఎలా తయారు చెయ్యాలో ఇక్కడ చూడండి.

పిబరె రామరసం రసనె
పిబరె రామ రసం

చరణం

జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌషిక ముఖ ప్రీతం

క్విజ్ కి సమాధానాలు  

Posted by దైవానిక

ఈ క్విజ్ ఎంటి అని అలొచిస్తున్నారా... అయితె ముందు ఇక్కడకి వెళ్ళాలి. సరె ఇక ఆసక్తి విషయానికి వస్తె, నా బ్లాగుకి ఒక 100 హిట్లు పెరిగాయి. కాని సమాధానాలు మాత్రం ఒక 5 గురి దగ్గర నుంచి మాత్రమే... సరె ఇక అసలు జవాబులు కి వచ్చేద్దాం.

1. భాగవతం ఎవరు, ఎవరికీ చెప్పారు.
భాగవతం మొదట్లొ, శౌనకాది మునులంతా సుత గొస్వామిని భగవంతుడి అవతారాల గురించి అడుగుతారు. అప్పుడు సుతుడు వారికి తను , శుఖదేవ గోస్వామి గారు పరీక్షిన్మహారాజు కి చెప్పగా విన్న భాగవతం చెప్తానంటాడు.
ఇప్పుడు జవాబు, రెండింట్లొ ఎదయినా కరెక్టే.

2. అర్జునుడు, అభిమన్యుడి చావుకి వీడె కారణం అని నిక్కచ్చిగా తేల్చి, చంపుతనాని శపథం కూడా చేసాడు.
జయద్రథుడు. ఇతడు సిందూ దేశానికి రాజు కనుక సైందవుడయ్యడు. ఇతడికి శివుడు ఒక వరం ఇస్తాడు. అర్జనుడు తప్ప మిగతా పాండవులని ఒక్క రోజు యుద్దంలొ కట్టడి చెయగలడు. దాని వల్ల అభిమన్యుడు పద్మవ్యూహం లో చనిపొయాడు. పూర్తి కథ మళ్ళా ఎప్పుడైనా చెప్తాను.

౩. గాథాసప్తశతి .
ఇది శాతవాహన రాజైన హాలవృచితుడు లేక హాలుడు రచించాడు. పేరులోనే ఉన్నట్టుగా అది మొత్తం 700 కథల సమాహారం. ముఖ్యంగా గమనించ వలసిందేంటంటే, ఆ కథలు అతను వ్రాయలేదు. కేవలం ఒకచోట చేర్చాడు.

4. సీత పెంపుడు తల్లి, భరత శత్రుగ్నుల ఇల్లాల్ల పేర్ల .
సీత తల్లి పేరు సునయనాదేవి.
భరతుడి భార్య మాండవి. శత్రుగ్నుడి భార్య శృతకీర్తి. వీరిద్దరి జనక మహారాజు తమ్ముని కూతుళ్ళు . అతను యుద్దంలో చనిపొయాక, జనకుడే సొంత కూతుళ్ళ లాగా చూసుకుంటాడు.

5. చాంద్రమాన మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి నాడు వచ్చే పండుగ
ఇది మహాశివరాత్రే. ఇక్కడ త్రయోదశి ఎందుకు ఉందంటే, ఉత్తర భారత దేశంలో కొందరు ఆ రోజు రాత్రి కూడ పూజలు చేస్తారంట.

6. చదరంగం కనిపెట్టింది.
మండోదరి. రావణాసురుడి భార్య. రావణుడు అస్తమానం యుద్దాలకు వెళ్తుంటే, తను ఊరికే ఇంట్లొ ఒక్కతే ఉండలేక చదరంగం కనిపెట్టిందట. రావణాసురుని ఓడించింది అని కూడా అంటారు మరి.

7. జటాయువు , సీతని ఎత్తుకుపోతున్న రావణుని తో పోరాడి ఇక్కడ పడి చనిపోయిందట
అది లేపాక్షి. పేరు లొ కూడ ఉంది చూడండి. రాముడు వచ్చి లే పక్షి అన్నాడంట. (అంటె రాముడికి తెలుగు వచ్చా అని సందేహం రావడం సహజం). ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ౧౫ కి.మి దూరం. బెంగుళూరు నుండి చాలా దగ్గర. తప్పక చూడవలసిన ప్రదేశం. దీని గూర్చి మళ్ళా ఎప్పూడైనా టపా వ్రస్తా.

8. చిట్టెలుక
చిఱు + ఎలుక. ఇక్కడ ద్విరుక్తటకారాదేశ సంధి జరిగింది.
ద్విరుక్తటకారాదేశ సంధి : కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు
ఇక్కడ వంశి మాగంటి గారు చెప్పిన వ్యాఖ్య తప్పక చూడండి. పరుచూరి శ్రీనివాస్ గారు, మీరు బహుమతి తప్పక ఇవ్వ వలసి వచ్చేట్టుంది.

9. జనక రాగాలు
ఇవి మొత్తం 72 . సప్తస్వరాలు కదా. అన్ని స్వరాలు ఉండే రాగాలని జనక రాగాలు అంటారు. వీటినే మేళకర్త రాగాలు అని కూడ అంటారు. 72 ఎలా వచ్చయొ తెలుసా?

10. అజంత భాష
తెలుగుతొ పాటు, ఇటాలియన్ కూడ అజంత భాష. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. మరి ఇటాలియన్ ని తెలుగు ఆఫ్ ద వెస్ట్ అని ఎందుకు అనరో?
సరే ఈ క్విజ్ కి సమాధానాలు పంపిన వారు , వంశి మాగంటి గారు, ఒక అనామకుడు గారు, సుజాత గారు , రాజశేఖర్ గారు మరియ ముక్కు శ్రీ రాఘవ కిరణ్ శర్మ గారు. ఎవరు ఎన్ని కరక్టో చెప్పాలంటారా?
మీ అందరికి నా తరుపున అభినందనలు మరియు నెనర్లు కూడా.










ఒక చిన్న క్విజ్  

Posted by దైవానిక

ఈ రోజు ఎందుకో ఒక చిన్న క్విజ్ తయారు చేయాలనిపించింది. నాకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవాలని నా చిన్న ప్రయత్నం ఇది. సమాధానాలు తెలిసిన వాళ్ళు నాకు వేగు పంపండి. దయచేసి సమాధానాలు వ్యాఖ్యల బాగంలో వ్రాయకండి. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే తప్పక వ్యాఖ్య వ్రాయండి.

1. అసలు భాగవతం ఎవరు, ఎవరికీ చెప్పారో తెలుసా?
2. అర్జునుడు, అభిమన్యుడి చావుకి వీడె కారణం అని నిక్కచ్చిగా తేల్చి, చంపుతనాని శపథం కూడా చేసాడు.
3. గాథాసప్తశతి ఎవరు వ్రాసారో తెలుసా?
4. సీత పెంపుడు తల్లి పేరు (అంటే జనక మహారాజు భార్య ) ?
పేర్ల దాక వచ్చాం కదా, భరత శత్రుగ్నుల ఇల్లాల్ల పేర్లు కూడా చెప్పండి?
5. చాంద్రమాన మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి నాడు వచ్చే పండుగేదో ?
6. చదరంగం కనిపెట్టింది ఎవరని అంటారు (మన పురాణాల లోని వ్యక్తే )?
7. జటాయువు , సీతని ఎత్తుకుపోతున్న రావణుని తో పోరాడి ఇక్కడ పడి చనిపోయిందట. ఎక్కడో తెలుసా?
8. చిట్టెలుక ని విడదీసి వ్రాస్తే ఏమవుతుందో తెలుసా? ఎ సంధి కూడా చెప్తే మంచిది .
9. జనక రాగాలు ఎన్నో తేలుసా?
10. తెలుగు అజంత భాష కదా! ప్రపంచంలో ఇంకొక భాష కూడా ఉంది ఇలానే. ఆ భాష ఏదో తెలుసా?

వీటికి సమాధానాలు రేపు అంటే 9th Apr 2008 సాయంత్రం ఇవ్వబడును.

ముఖ్య గమనిక : పైన ప్రశ్నలలో కొన్ని తప్పులు దొర్లాయి.. వాటిని సవరంచి తిరిగి ప్రచురిస్తున్నాను.

8 వ ప్రశ్నకి సమాధానం చెప్పిన వారికి పరుచూరి శ్రీనివాస్ గారు బహుమతి ఇస్తానన్నారండి. త్వరపడండి మొదటి కరెక్టు సమాధానానికి మాత్రమె.


ఉగాది శుభాకాంక్షలు  

Posted by దైవానిక

అందరికి శ్రీ సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరు ఆయురారోగ్యలతో , అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.



కొత్త బంగారు లోకం , మనకి కావాలి సొంతం
గాలి పాడాలి గీతం , పుడమి కావాలి స్వర్గం ...........

ముఖ్యంగా అందరు ఉగాది పచ్చడి, బొబ్బట్లు/పూర్ణాలు చేసుకొని తినడం మర్చిపోకండే.....

మరుగున పడ్డ కొన్నిఆచార-వ్యవహారాలు  

Posted by దైవానిక

నేను చాలా రోజులుగా ఈ టపా వ్రాద్దామనుకుంటున్నాను. మొన్నామధ్యన కాలెండర్ చూస్తుంటే "రథ సప్తమి" అని కనిపించింది. తారీఖు చూస్తే దాటి పోయింది. అయ్యో చిన్నప్పుడు ఎంచక్కా చిక్కుడుకాయ కూర తినేవాల్లమే అనుకున్నా. ఆ తెల్లవారు ఫిబ్రవరి 14. అంటె valentines Day అన్నమాట. అది మాత్రం మర్చిపొకుండా చేసుకున్నాం. ఇలా ఎన్నో అలవాట్లు, ఆచారాలు మర్చిపోతున్నాం. అవన్ని ఒకసారి నెమరువేయటమే నా ఈ చిన్ని ప్రయత్నం. అవి అలా ఎందుకు చేస్తారో మాత్రం నాకు తెలీదు సుమండి. అందువల్లె అవి అందరికి గుర్తుండవు అనుకుంటా!!!!!!!

ముందుగా రథ సప్తమి. చాలా ప్రాంతాలలో ఉదయాన్న, చిక్కుడు ఆకులు తలమీద పేట్టి స్నానం చేస్తారు. ఇక చిక్కుడు కాయ కూర మాత్రం తప్పనిసరి. ఇది చంద్రమాన మాఘ శుక్ల సప్తమి నాడు వస్తుంది. అంటె, సుమారుగా ఫిబ్రవరి, మార్చి కాలంలో అన్నమాట.

ఇక తరువాతది తొలి ఏకాదశి. ఆ రోజు తప్పకుండా పేలాల పిండి తినేవాళ్ళము. పేలాలు కూడా వేంచిపెట్టే వాళ్ళు. పేలాలు అంటే తెలియని వాళ్ళకి, వాటిని popcorn అంటారు. ఇది చాంద్రమాన ఆషాడ శుక్ల ఏకాదశి నాడు వస్తుంది. అంటే, జులై ఆగష్టు కాలంలో అన్నమాట. రైతన్నలకు ఇది పెద్ద పండగ. ఈ రోజు తరువాతే నాట్లు ప్రారంభించేవారు. ఇక ఇంట్లోనే popcorn దొరుకుతుంది అంటే, పిల్లలందరికీ మహా సరదా.

అట్లతద్దె అంటే చాలామందికి తెలుసును. కాని ఆరోజు అట్లు తినడమే కాకుండా ఇంక వేరేవి చేస్తారు అని తెలీదు. మా చిన్నప్పుడు ఇంటి దూలాలకి పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టేవాళ్లు. ఇంక ఉయ్యాలలు జంపాలలే. పిల్లల ఆనందానికి హద్దులే ఉండవు. ఇంట్లోనే ఉయ్యాలలు, అవి దూలాలకి వేలాడేవి. గంటలు గంటలు ఉయ్యాలలు ఊగేవాళ్లము. అవి తీసేస్తుంటే ఇంక ఏడుపులు పెడబొబ్బలు. ఇది చంద్రమాన ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది. అంటే సుమారుగా సెప్టెంబర్-అక్టోబర్ లో అన్నమాట.

దీపావళి అందరికి తెలిసిన పండుగే. కాని ఆరోజు మతాబులు కాల్చడం కాకుండా వేరేవి కూడా చేసేవారు. మగపిల్లలు అయితె దివిటిలు తిప్పేవాళ్ళు . గోగేన చెట్టు మండలకి ఒక పక్క మంట అంటించి, చేతులతో తిప్పడం. వాటి మీద నుంచి దాటించడం చేసేవారు. ఇక ఆడ పిల్లలకి, పల్లేరు కాయలో దీపం పెట్టి, దానిని తాటాకు తో చేసిన ఒక holder లాంటి దానిలో పెట్టి , చుట్టూ తిప్పి ద్రిష్టి తీసేవారు . ఇక ఈ కార్యక్రమం అయితె ఇక మతాబులే మతాబులు. దీపావళి ఎప్పుడొస్తుందో అందరికి తెలిసిందే. అది చంద్రమాన ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంటే సుమారుగా అక్టోబర్-నవంబర్ ప్రాంతంలో అన్నమాట.

కోర్ల పౌర్ణమి, ఇది చాల మందికి తెలిసి ఉండకపోవోచ్చు. ఆ రోజు ఉదయాన్నే లేచి, పళ్ళు తోముకొని కుక్కలకి ఉండ్రాళ్ళు కొరికి వేసేవాళ్ళము. ఇది చెయ్యాలంటే ఎంత సరదానో మాటల్లో చెప్పలేను. ఈ రోజుకి కొంత మంది ఇది చేస్తున్నారు కాని ఉండ్రాళ్ళ బదులు ఇడ్లిలు వాడుతున్నారు. ఇది చంద్రమాన మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది. అంటే సుమారుగా డిసెంబరు- జనవరి ప్రాంతంలో.

కార్తిక మాసం, మన తెలుగు వారికీ ఎంతొ విశిష్ట మాసం. నోములు, వ్రతాలు చాలా చేస్తుంటారు. కార్తిక సోమవారము, కార్తిక పౌర్ణమి లాంటివి కొన్ని. కాని పిల్లలకు ఇష్టంగా చేసేది , ఉసిరి చెట్టు కింద వనభోజనాలు . అడివిలోకి వెళ్లి , ఒక ఉసిరి చెట్టు చూసి, దాని దగ్గర మకాం వేసి, వంటలు చేసి, తిని , సరదాగా ఆటలు ఆడి వచ్చేవాళ్ళు . అబ్బ ఎంత సంబరంగా ఉండేదో. ఇంకా కార్తిక మాసానికి, ఉసిరికి చాల బంధం ఉంది. తులసి కల్యాణం కూడా ఈ మాసంలోనే చెసేది. కన్నడిగులకి, కొంకిని వాళ్ళకి పెద్ద పండుగ. చాంద్రమాన కార్తీక శుక్ల ఏకాదశి/ద్వాదశి నాడు వస్తుంది. తులసి చెట్టు చుట్టూ ఉసిరి మండలతో పందిళ్ళు వేసి తులసి కల్యాణం చేస్తారు. ఇక పిండి వంటలకు ఏ మాత్రం కొదవుండదు.

ఇప్పటికే చాల చెప్పినట్టున్నాను. ఇంకా గుర్తొస్తే తరువాత టపాలో వ్రాస్తాను