నిన్న టీవి చూస్తున్నప్పుడు ఏదొ పి.సుశీల గారి సింగపూర్ కంసర్ట్ గురించి వస్తుంది. నాకప్పుడు వెంటనే రెండు పాటలు గుర్తొచ్చాయి.
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా!
నా అందచందములు దాచితినీకై రావేలా! (సంఘం సినిమాలోది)
ఆకులో ఆకునై పువ్వులో పువ్వు నై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై .. (మేఘ సందేశం సినిమాలోది)
వెంటనే youtube లో వెతికాను. మొదటిది కనిపించలేదు.. రెండోది కనపడ్డది. వింటూంటే అర్థం గురించి భావం గురించి ఆలోచిస్తే...
ఆకులో ఆకునై పువ్వులో పువ్వు నై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా ..
ఎటులయినా ఇచటనే ఆగిపోనా
అబ్బా ఈ ఆడవి ఎంత బాగుంది. ఏ ఆకునో , పువ్వునో, కొమ్మనో లేక Atleast రెమ్మనొ అయ్యి ఈ ఆడవిలో కలసిపోతె ఎంత బాగుండును. ఎంచక్కా ఇక్కడే ఉండొచ్చు.
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరి చేడె చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ..
ఎటులయినా ఇచటనే ఆగిపోనా
(చేడె = కాంత)
ఈ ఆడవిలో గలగల మని వీస్తున్న చల్ల గాలిలో కెరటాన్నొ ( నీరు గలగలా పారుతుందేమో, అలాగే సముద్రములో కదా అలలుండేది) లేక జలజల మంటున్న సెలయేట్లో స్వఛ్ఛతనో , అల్లదిగో అక్కడ పగడపు రంగులో ఉన్న లేత చిగురు కింద తుమ్మెదుంది కదా అదయినా బాగుండును. ఇప్పుడే పూసిందనుకుంటాను పువ్వు, అప్పుడే యవ్వనంలోకి వచ్చిన కాంత లాగా సిగ్గు పడుతుంది.. కనీసం ఆ సిగ్గునయినా బాగుండును ఈ ఆడవిలో కలసి పోవచ్చును. అప్పుడు హాపీగా ఇక్కడే ఉండొచ్చు.
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరళి వెర్రినై ఏకతమా తిరుగాడా
(చదలు = ఆకాశం, జలదము = మేఘం, తరళి = అడవి అనుకుంటాను)
మెల్లగా ఆ చెట్లెక్కి , ఆ తరువాత అల్లదుగో ఆ కొండెక్కి, పనిలొ పనిగా ఆకాశానికి ఎక్కేసి, అక్కడ నీలంగా మేఘం కనపడుతుందే ఆ మేఘపు నీలి ప్రకాశాన్నైతే నా సామి రంగా...
ఇక ఆకలిదప్పులులేక , చీకు చింతా లేక ఈ ఆడవిలోనే పిచ్చోన్నై ఎంచక్కా ఒంటరిగా తిరిగేస్తాను..
ఇప్పుడు చూడండీ పాట ఇక్కడ. ఈ పాట వ్రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
డిజర్వేషన్లు ఇస్తే చలితులు మతం మారరు. అవునా? – 10
4 నెలల క్రితం