ఆవేశం ఆవేదన ఆక్రోశం  

Posted by దైవానిక

ఏమిటీ దారుణం?? ఎందుకీ మారణహోమం?? ఏం చేస్తుందీ ప్రభుత్వం??
ఏమీ చేయలేని నిస్సహాయత ఎందుకు??
బ్రతుకు భీభత్సం చేయడమే లక్ష్యమా??
తీవ్రవాద చరిత్రలోనే అతి దారుణమయిన సంఘటన జరిగిన రోజుగా, ఈ రోజు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. తీవ్రవాదములోనే ఒక వినూత్న పద్దతిని ప్రవేశపెట్టి, జనాన్నిభయ భ్రాంతులకి గురి చేసే సంఘటన. పోలీసు జీపులోనుంచి యథేచ్ఛగా కాల్పులు జరిపిన తీవ్రవాదం. హాస్పిటల్ల మీద బాంబులు విసరడం. ఇవన్నీ తలుచుకుంటేనే వెన్నుపూసలోంచి సన్నగా భయం పుట్టుకొచ్చి ఒళ్ళంతా వణుకుతుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం, ఏది చేసినా ఈ దారుణమే గుర్తురావడం, మనస్సు పడే అవేదన ఎవరికి చెప్పను. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదే??
అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా నీ లీలలు.. ఇంతా జరుగుతుంటే ఎక్కడున్నావయ్యా?? పూర్వ జన్మ పాపం అని సరిపెట్టుకుందామంటే మనస్సొప్పుకోవట్లేదేమయ్యా??

కరాచీ నుంచి బోటులో తీవ్రవాదులు రావటం ఏమి విచిత్రం?? అంత సులువుగా బోటులో ఆయుధాలేసుకొనెచ్చేసారే, ఇక ఈ దేశంలో భద్రత ఎక్కడుంది. ఇదేదో గోలకృష్ణ సినిమాలలోనే జరుగుతుందనుకున్నాను కాని, నిజంగా జరగుతుందని కలలో కూడా అనుకోలేదే.

ఏ చానల్ చూసినా ఈ కుల మత విచక్షణ చేసి మృతులను విడదీయడేమిటీ. అందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఏమి ఈ లెక్కలు స్వామీ?? మానవత్వం అని ఒకటుందనే మర్చిపోయినట్టున్నారే??
ఒక పక్క ఆర్థిక సంక్షోబంలో దేశం, ప్రపంచం కొట్టి మిట్టాడుతుంటే మధ్యలో తీవ్రవాదం నేనూ ఉన్నానని పలకరిస్తోందా ఏమిటీ??
హయ్యో ఏమి ఈ బాధ, తట్టుకోలేకున్నానే. ఇలా భయపెట్టడమే తీవ్రవాదులు లక్ష్యమైతే వారి కోరిక నెరవేరినట్టే. ఎంతో దూరాన ఉన్న నాకే ఇంత భయం వేస్తుంటే, అక్కడ ఉన్న జనం ఇంకెంత భయపడుతున్నారో.

ఏంటో మొదలెట్టి, ఏదో చెప్పి , ఎలా ముగిస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు.
ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలకు కొరత లేకుండా చూడాలని ఆ పరమాత్మకి దణ్ణం పెట్టుకోవడం తప్ప నేనేమి చెయ్యగలను. ఈ నిస్సహాయతని చూస్తే నా మీద నాకే అసహ్యం వేస్తోంది.

ప్యాలేస్ గ్రౌండ్స్ లో పుస్తకాల వేట  

Posted by దైవానిక

పోయిన వారం బెంగుళూరు పుస్తకాల పండగ(bangalore book festival) ప్యాలేస్ గ్రౌండ్స్ లో జరగనున్నాయని, అన్ని భాషా పుస్తకాలు లభిస్తాయని వార్తపత్రికలో చదివి తప్పకుండా వారంతం వెళ్ళాలని నిర్ణయించేసాను. బెంగుళూరులో తెలుగు పుస్తకాలు దొరకడమే మహాభాగ్యం. వెంటనే పూర్తిగా ఈ సౌకర్యం వినయొగించుకోవాలని అనుకున్నాను, కాని ప్యాలేస్ గ్రౌండ్స్ లో అంటేనే గుండె గుటుక్కుమంది. మొన్ననే అక్కడ రెండు రోజులు ట్రాఫిక్కు జాం అయ్యి సుమారు 5 గంటలు జనాలు ఇరుక్కుపోయారు. కాని పుస్తకాల కోసం అందునా తెలుగు పుస్తకాల కోసం ఎంతటి ప్రయాసనయినా అనుభవించాలనే డిసైడ్ అయ్యాను. అసలే కొనాల్సిన పుస్తకాల లిస్టు బాగానే ఉంది. మా ఓరుగల్లు విశాలాంధ్రలో, ఏ పుస్తకం అడిగినా లేదండి అని ఒకే సమాధానం చెప్తున్నారు. కనుక ఎటువంటి అవాంతరాలొచ్చినా వెళ్ళి తీరాల్సిందేనని తీర్మానించటం జరిగింది. తోడు ఎవరన్నా వస్తారేమోనని ఆలోచించా, బుక్ ఫెస్టివల్ కొచ్చెవాళ్ళు ఎవరూ ఊళ్ళో లేకపోవడం వల్ల ఒక్కడినే బయలుదేరాల్సొచ్చింది. బెంట్రామ ( బెంట్రామ: బెంగుళూరు ట్రాఫిక్కు మథనం, ఇది కావించిన ఇహంలోనే నరకప్రాప్తి లభించును) గావించుటకు మిట్ట మధ్యాహ్నం బయలు దేరా, మిట్ట మధ్యాహ్నం అయితే ట్రాఫిక్కు ఎక్కువ ఉండదులే అని. కాని నేనొక వెర్రిమాలోకాన్ని అని మొదటి జంక్షన్ చేరగానే తెలిసింది. బెంగుళూరులో జనం వారాంతం అనగానే మిట్ట మధ్యాహ్నం దాకా నిద్దరోయి, సూర్యుడు నడి నెత్తికి వచ్చినప్పుడే బయటకి వస్తారన్నమాట. ఎలాగోలాగ, తలలో పేను దూసుకెళ్ళినట్టు దూసుకెళ్ళి ఒక గంటలో చేరుకున్నాను. బుక్ ఫెస్టివల్ అంటే ఖాళీగా విలవిలలాడుతుందనుకున్నాను కాని జనం యిరగున్నారు. మొదట కాస్త ఆశ్చర్య పడినా తరువాత ఆనందపడ్డాను. ఎంట్రీ టికెట్టు, అదీ ఇరవయ్యి రూపాయలనే సరికి, జనాలు డబ్బు కట్టి మరీ ఇంత మందొచ్చారని ఇంకాస్త సంతోషపడ్డాను. ఇక దాడి ఆరంభించాను. ఒక 5,6 షాపులు దాటగానే తెలుగు పుస్తకాల షాపుంది. అబ్బ అని అటాక్ చేసా. నేను కొందామనుకుంటున్న చాలా పుస్తకాలు కనపడ్డాయి. వాటి వివరాలు ఇక్కడ.
1. భారతంలో చిన్ని కథలు , రచయిత: ప్రయాగ రామకృష్ణ , పబ్లిషర్: ధరణి ప్రింటర్స్ , వెల: 150
ఈ బుక్ కోసం చాలారోజులుగా వెతుకుతున్నాను. స్నేహితుడొకడు చెప్పగా విని కొనాలని చాలా రోజులుగా ప్రయత్నించాను. వరంగల్లు లోని విశాలాంధ్ర వారు తెప్పిస్తానని చాలా రోజులుగా దాటేస్తున్నారు. కాని పుస్తకం చదివాక (చదివినంతవరకు) చాలా కథలు తెలిసినవే ఉండడం నన్ను కాస్త నిరుత్సాహ పరచింది. ఇంకా చాలా కథలే ఉన్నాయి. పూర్తిగా చదివితే గాని చెప్పలేను. రచయిత "వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ" అని రేడియేలో వినపడే ఆయినేనా అన్న అనుమానం తీరలేదు.

2. శతక రత్నాకరము - గుంటూరు వీరరాఘవశాస్త్రి - బాలసరస్వతి బుక్ డిపో - 150 -
అలా పుస్తకాలు చూస్తుంటే ఇది తగిలింది. ఈ మధ్య నా పద్య పైత్యం గురించి ముందే చెప్పాను కదా.. చూసిన వెంటనే కొనేసాను. దీనిలో చాలా శతకాలున్నయి. కొన్నిటి పేర్లు కూడా వినలేదు, ఉదా:- కీరవాణి శతకము, జనార్థన శతకము, కుమారీ శతకము. దాదాపుగా ౩౩ శతకాలున్నాయి. ఇన్ని ఒకచోట దొరకడం అదృష్టమే. కాని వాటికి తాత్పర్యాలు లేవు. నా తెలుగు మీద నాకంత నమ్మకమా!! అని ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నాను. అయినా పదాలకి అర్థాలు తెలియకపోతే బ్రౌణ్యముండనే ఉంది, ఇంకా అర్థం కాకపోతే బ్లాగుల్లో చాలామందున్నారన్న నమ్మకం.

3. రంగనాయకమ్మ నవలలు: పబ్లిషర్: స్వీట్ హోంపబ్లికేషన్స్
చదువుకున్న కమల - 15
ఇదే నా న్యాయం - 50
బలిపీఠం - 60
జానకి విముక్తి - 125
రంగనాయకమ్మ గారి నవలలు చదవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మన సుజాత గారి మాటలు విన్నాక, మొన్నా మధ్యన జరిగిన చర్చ చూసాక ఆవిడ పుస్తకాలు కొనాలనే నిర్ణయం బల పడింది. కాని ఏమి కొనాలో తెలీలేదు. విషవృక్షం కోందామంటే, సైజు చూసి కొంచెం దడుచుకున్నాను. మొదట వేరేవి చదివి ఆ తరువాత అది చదువుదాములే అని ఆ నాలుగు కొన్నాను. ఎలా ఉంటాయో ఏమిటో??

4.పెద్దబాలశిక్ష - పోతూరిసీతారామాంజనేయులు- టాగూరు పబిషింగ్ హౌస్ - 27
వెనకట పెద్దబాలశిక్షలేని ఇల్లు ఉండేది కాదట. ఇంతకు ముందు నా రూమ్మేట్ దగ్గర ఉండేది. అసలు అందులో లేనిది లేదంటే ఆశ్చ్రర్యపోనక్కరలేదు. అది చూసి చాలా నచ్చేసింది. వాస్తు గురించి, సామెతలు, కవుల గురించి, తిథులు, ఒక్కటేమిటి లేనిదుండదు. చాలారోజులుగా కొనాలనుకుంటున్న మరో పుస్తకం ఇది. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. మన ఇంట్లో తప్పకుండా ఉండవలసిన పుస్తకం.

5. అమరావతి కథలు - సత్యం శంకరమంచి - నవోదయా పబ్లిషర్స్ - 175
అమరావతి కథలు గురించి తెలియనిదెవ్వరికి చెప్పండి. మా చిన్నప్పుడు దూరదర్శన్ లో అమరావతీ కి కథాయే అని హిందిలో వచ్చేవి. భళేగా ఉండేవి. చాలా మంది తెలుగు నాయికానాయకులుండడంతో ఇంకా ఆసక్తిగా చూసేవాణ్ణి. అశోక్ కుమార్ చాలా వాటిల్లో ఉండేవాడు. ఇవి టీవిలో చూడడమే కాని చదివిన పాపాన పోలేదు. బుక్ అక్కడ కనపడిన వెంటనే ఠక్కున పట్టుకున్నాను. చదవాలి .. బాగుంటాయని గట్టి నమ్మకం.

6. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - విశాలాంధ్ర - 100
అక్కడ పుస్తకాలమ్మే అతని గట్టి రికమండేషన్, తప్పకుండా చదవి తీరాలన్నాడు. ఇంతకు మించి నాకు రచయిత గురించి గాని కథల గురించి కాని ఏమి తెలియదు. బాగుంటాయనే అనుకుంటున్నాను

7. నవ్వితే నవరత్నాలు 1&2 - మల్లిక్ - ఎమెస్కో బుక్స్ - 50
మల్లిక్ అంటే హాస్యానికి పెట్టింది పేరు. అందుకని కొన్నాను. అందుకే కాదులే, ఎందుకో మల్లిక్ అంటే కాస్త అభిమానం. బాగుంటాయని నమ్మకం కూడా.

8. అంపశయ్య - నవీన్ - ప్రత్యూష ప్రచరణలు - 120
నవీన్ గురించి చాలా విన్నాను. అతని చైతన్యస్రవంతి గురించి కూడా. అంపశయ్య గురించి కూడా. 60 లలో విధ్యార్థుల గురించి, వాళ్ళ విప్లవాల, ఆలోచనల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఈ పుస్తకం కొనడం జరిగింది.

9. టాగోర్ గీతాంజలి - చలం - అరుణా పబ్లిషింగ్ హౌస్ - 30
ఈ పుస్తకం చూడగానే చలం గీతాంజలిని అనువదించాడా, అయితే తప్పక చదవాలని తీసుకున్నాను. చలం ఇంటర్ప్రెటేషన్ చదవాలని కొన్నాను.

10. బుడుగు - ముళ్ళపూడి వెంకటరమణ - విశాలాంధ్ర - 90
బుడుగు గురించి గాని రమణ గారి గురించి కాని ఇంట్రడొక్షన్ ఇవ్వడం దుస్సాహసమే అవుతుంది.

ఇదండీ నా పుస్తకాల వేట. అన్ని పుస్తకాల మీద 10% రాయితీ వచ్చింది. నేను విశాలాంధ్ర మెంబర్ ని అవ్వడం వలన వాళ్ళ పబ్లికేషన్స్ మీద 20% రాయితీ లభించింది. ఇన్ని పుస్తకాలకి కేవలం ఒక సహస్రం మాత్రమే అవ్వడం అమితానందాన్నిచ్చింది. నేను హ్యారీపోటర్ ఒక్క పుస్తకం 975 పెట్టి కొన్నాను. ఇప్పుడు దాదాపుగా అదే ధరకి నాకు 14 పుస్తకాలొచ్చాయి. (మాలతి గారు వింటున్నారో లేదో, మేమూ పుస్తకాలు కొంటున్నాం). మళ్ళి సంవత్స్రరం తప్పకుండా వస్తానని షాపతినికి చెప్పి 5 కిలోల పుస్తాకలు పట్టుకొచ్చాను(కిలోలంటున్నాని ఆశ్చర్యపోకండి. బెంగుళూరులో అన్ని కిలోల లెఖ్ఖే..కిలో నారింజ పళ్ళు, కిలో సొరకాయి, కిలో పుస్తకాలు. ఈ పుస్తకాలన్ని బాగా చదివాలని, ఎవ్వరు అప్పివ్వమని అడగకూడదని, ఒకవేళ వాళ్ళడిగినా నేనివ్వకూడదని, ఒకవేళ నేనిచ్చినా వాళ్ళి తిరిగిచ్చేయాలని అప్పుడే దేవిడికి దణ్ణం కూడా పెట్టేసాను. అయినా నా అమాయకత్వం కాని ఇవన్ని మనచేతుల్లోనే ఉన్నాయని గ్రహించలేకపోయాను. కొన్నానని ఎవరికైనా చెప్తే కాదా హి హి హి

అత్తగారు - చురకలు  

Posted by దైవానిక

మా అత్తగారు మాంచి హాస్య చతురులు. ఎప్పుడు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కాని ఎప్పుడయినా కాస్త కోపం వస్తే చురకలు భళే వేస్తారు. నాకీ అనుభవం పెళ్ళైన కొత్తలోనే వచ్చింది. ఇప్పటికి ఆ సంగతి గుర్తొచ్చినప్పుడు తెగ నవ్వొస్తుంది. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారి తరుపు బంధువు ఒక ముసలావిడ రోజు మా ఇంటికి వస్తుండేది. ఆ మాట ఈ మాట చెప్పి సుబ్బరంగా ఇంట్లో చేసినవన్ని లాగిస్తూ ఉండేది. మా అత్తగారు పెద్దగా పట్టిచ్చుకునేవారు కాదు. పాపం పెద్దావిడ, కాస్త తిండి యావ ఎక్కువనుకుంటా అనేవారు. ఇంకొన్నాళ్ళకి వంటింట్లోకి దూరి అన్నిటిని వెతికి తినడం ప్రారంభించింది.ఆచారవంతురాలైన మా అత్తగారు, మామూలుగా వంటింట్లో తన మడి వంట సామాన్ని ఎవర్ని ముట్టనివ్వరు. పనివాళ్ళు ఎవరయినా ముట్టుకుంటే ఆ రోజు యుధ్ధమే. ఈ ముసలావిడ అవన్ని ముట్టేసుకొని అంతా కెలికి వదిలేసింది. మా అత్తగారికి చిర్రెత్తుకొచ్చింది. కనుబొమ్మలు రెండు కలసిపోయాయా అన్నంత దగ్గరకొచ్చాయి. నాకు భలే భయం వేసింది. కాని మా అత్తగారు ఏమి అనకుండా ఊరుకున్నారు. హమ్మయ్య అంతా శాంతించింది కదా అనుకున్నాను. ఆ ముసలమ్మ అంతా వెతికి వచ్చి కూర్చుంది. మా అత్తగారు ఏమి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు.
"అమ్మణ్ణీ, ఇదవరికి మధ్యాహ్నాలు ఏము తోచేది కాదే, ఈ మధ్య మీ ఇంటికొస్తున్నానా, బాగా పొద్దుపోతోంది" అందా ముసలావిడ. మా అత్తగారు చురుక్కున ఒక్క చూపు చూసి
"తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందట" అని అన్నారు. అంతే ఆ ముసలావిడ మళ్ళా మా ఇంటివైపు చూస్తే ఒట్టు. అప్పుడు కాస్త మనస్సు చిముక్కుమన్నా తర్వాత మా అత్తగారి చతురతని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
తరువాత మా అత్తగారి అక్క మనవరాలి పెళ్ళికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద యుధ్ధమే జరిగింది. ఎవరో ఒకావిడ కొడుకుని ఇంకికావిడ ఏదో అందిట, అంతే ఆ ముందావిడ, అన్నావిడ వంశం మొత్తాన్ని ఏకి పారేసింది. మూడూర్లకి వినిపించేంత గట్టిగా అరిచి, ఆపడానికొచ్చిన అమ్మలక్కలందరినీ నాలుగు తిట్టి పెట్టే బేడా సర్థుకోని వెళ్ళిపోయింది. మా అత్తగారు అసలే తగువులకి దూరంగా ఉంటారు. అంతా ఒక మూలనుంచి చూసి వదిలేశారు. ఆ తిట్లు పడ్డావిడ కూడా బాగా గుణిగి, తన పరిథిలో తిట్టి బయలుదేరి వెళ్ళింది. ఆ తరువాత మా అత్తగారి అక్క కోడలు వచ్చింది. ఆవిడకి తగువులంటే బహు సరదా అనుకుంటా.. ప్రతి ఒక్కళ్ళ దగ్గరకి వెళ్ళి జరిగిన తగువు గురుంచి తెలుసుకోని, తన గురించి కాస్త డప్పుచెప్తుంది. తను ఏవిధంగా మహా శాంతమూర్తో, అసలు తనకి తగువంటే ఏంటో కూడా తెలియదన్నట్టు మాటలు చెప్పసాగింది. మా అత్తగారు ఇవన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అసలే ఆవిడంటే మా అత్తగారికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఇంతలో ఆవిడ మా అత్తగారి దగ్గరికి కూడా వచ్చింది.
"అవునత్తమ్మా , ఆ పేరందేవి సుబ్బమ్మని నానా తిట్లు తిట్టిందటగా??"
"ఊ"
"అంతా నీముందే! వెళ్ళి ఆపలేకపోయావా!! నేనయితే ఎలాగోలాగ ఆపేదాన్ని, సమయానికి మా ఇంటికెళ్ళాల్సొచ్చింది"
"ఆపినా ఆగే రకమేనా అది??" అన్నారు మా అత్తగారు.
"ఏమోనమ్మా, అసలు నాకు ఈ తగువులంటేనే పడవు. నేనసలు ఎవరి జోలికి పోను. అదికాదత్తా, అసలు ఈళ్ళకి ఈ తగువులెందుకొస్తాయంటావు??" మా అత్తగారి కనుబొమ్మలు మళ్ళా కలిసిపొతాయేమో అన్నట్టుగా తయారయ్యాయి. వెంటనే చురక పడబోతుందనుకుంటూనే ఉన్నా, "జగడమెందుకొచ్చిద్దిరా జంగందేవరా అంటే, బిచ్చమెయ్యవే బొచ్చుముండా అన్నాడంట" అన్నారు మా అత్తగారు. చుట్టుపక్కల అమ్మలక్కలంతా పగలబడి నవ్వారు. కొందరు దీని తిక్క కుదిరిందనుకున్నారు. ఆవిడ ఠక్కున లేచి చురచుర చూసి కోపంతో రుసరూలాడుతూ వెళ్ళింది.

ఇంతలో పెళ్ళి తంతూ అంతా అయ్యింది. ఇంకా ఎవరికి చురకలు పడలేదనే చెప్పాలి. మా అత్తగారి దగ్గర అందరూ కాస్త జాగ్రత్తగా మసులుతున్నారు. ఎందుకొచ్చిన చురకలో అని అనికొనుంటారు. ఇంతలో పెళ్ళి కూతుర్ని గడప దాటించే సమయం రానే వచ్చింది. పెళ్ళి కూతురుది కాస్త భారీ శాల్తీ. ముగ్గరమ్మలక్కలు గట్టిగా తోసినా అంగుళం కూడా కదలట్లేదు. అమ్మలక్కలంతా గదిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మయేమో కొంచెం కూడా కదలట్లేదు. కదలక పోగా, "ఉహూ, నాకు సిగ్గు, నేను వెళ్ళను" అంటూ మెలికలు తిరిగి పోతుంది. మా అత్తగారు వెనకనుంచి అంతా చూస్తూనే ఉన్నారు. ఇలా తతంగం అంతా ఒక పావుగంట నడిచింది. పెళ్ళి కూతురు మాత్రం కొంచెం కూడా కదల్లేదు. మా అత్తగారికి ఒళ్ళు మండినట్టుంది. కనుబొమ్మలు కలుస్తున్నాయి.
" వెనకటికి నీలాంటిది ఇంట్లో మొగుడున్నాడని తెగ సిగ్గుపడి, వీధిలో బట్టలు మార్చుకుందట" అని బిగ్గరగా అంది. వెంటనే అందరు పడిపడి నవ్వారు. పెళ్ళికూతురు తలవంచుకొని మెళ్ళగా లోపలెకెళ్ళి గడిపెట్టింది. మా అత్తగారి సమయస్పూర్తికి, హాస్య చతురతుకు అందరు నాలుగు పొగడ్తలు ఝుళిపించారు.
(సమాప్తం)

ఈ కథని నేను భానుమతి గారి అత్తగారు కథలు చదివి ఇన్స్పైర్ అయ్యి వ్రాసింది. మీకు కథ నచ్చితే ఆ గొప్పంతా, ఆ పాత్ర సృష్టించిన భానుమత్తి గారిదే. నచ్చకపోతే ...

నాకు నచ్చిన పద్యాలు  

Posted by దైవానిక

ఈ మధ్య నేను పద్యాల్నే చదువుతూ, తింటూ, పద్యాల్నే కలలు కనడం, వ్రాయడం కూడా జరిగుతుంది. నాకేమన్నా పద్యపైత్యం పట్టుకుందేమో అని అనుమానంగా కూడా ఉంది. పత్యం చేసి పైత్యం తగ్గేలోపే, నాకు నచ్చిన ఆ నాలుగు పద్యాలు నెమరు వేసుకుంటే పోతుందనే ఒక అద్భుతమైన ఐడియా బుర్రలోకొచ్చింది.
పద్యమంటే, ఎప్పటికీ మర్చిపోలేని పద్యం ఒకటుంది. శ్రీనాథుడు వ్రాసిన చాటుపద్యం. చాటుపద్యాలు చెప్పడమే నా దృష్టిలో చాలా గొప్ప. నేను, ఈ పద్యం చెప్పేముందు ఒక పిట్ట కథ చెబుతాను. అది శ్రీనాథుడు జీవిస్తున్న కాలం( సంవత్సరం సరిగ్గా గుర్తులేదు).ఏంటో ఏ ఊరో కూడా గుర్తురావట్లేదు సుమా! శ్రావణ మాసం దాటింది, అయినా వానలు లేవు. భాద్రపదం, ఆశ్వయుజం కూడా దాటాయి, వాన జాడ మాత్రం తెలియలేదు. ఇక లాభం లేక "డ్రాట్" అని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. తాగడానికి కూడా నీరు లేక పిల్ల-జల్లా, గొడ్డు-గోద అంతా అలమటిస్తున్నారు. భీభత్సమైన పరిస్థితి, క్షామం అన్నిచోట్లా భరతనాట్యం చేస్తోంది.( మన శాస్త్రీయ నృత్యం కూచిపూడి అనుకుంటున్నారు కదా! మరి క్షామానికి భరతనాట్యానిది పెద్ద అనుబంధమే). అలాంటి సమయంలో మనస్సును ఉత్తేజపరిచే చాటు పద్యం చెప్పడం కవి సార్వభౌమునికే చెల్లింది. సరే ఇక ఆస్వాదించండి.

కం॥ సిరిగలవానికి జెల్లును
తరుణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్

సిరినే తన వశం చేసుకున్నా ఆ శ్రీకాంతుడు పదహారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడంటే అర్థం ఉంది. రోజు బిక్షాటన చేసే జంగందేవరవి, నీకెందుకయ్యా ఇద్దరు పెళ్ళాలు. చాలు చాల్లేగాని గౌరమ్మని నువ్వుంచుకొని, గంగమ్మని పంపవయ్యా!! ఇది శ్రీనాథుని భావం. ఇది విన్నాక పరమశివుడైనా మరెవరైనా ఆనందంచి గంగమ్మని పంపకుండా ఊరుకుంటారా??

ఇక పద్యాం అంటే నాకు గుర్తొచ్చే రెండో పద్యం ధూర్జటి కవి వ్రాసింది. కాస్త వైరాగ్యం, కాస్త భక్తి కలిగిన పద్యం. ప్రపంచంలోనే అతి పెద్ద వింతని(7 వండర్స్ లో లేదులెండి) చక్కగా రూచి చూపే పద్యం. శార్థూలంలో ఛందంగా ఉంటుంది.

శా॥ అంతా మిథ్య తలంచిచూచిన, నరుండట్లౌటెరింగిన్ సదా!
కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
బ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు తాఁ
చింతాకంతయు చింతయుంచడు కదా శ్రీకాళహస్తీశ్వరా!

ఎప్పటికో ఒకప్పుడు పుటుక్కుమంటానని తెలిసి కూడా మానవుడు, భార్య, పిల్లలు, శరీరం, డబ్బులు అన్న బ్రాంతిలోనే ఉంటాడుకాని, అన్నిటికి మూలమైన నీయందు కొంచెం శ్రద్ద కూడా చూపించడయ్యా ఓ ఈశ్వరా! ఇది ఆ పద్యభావం. చిన్నప్పుడు చదివినప్పుడు పెద్దగా అర్థమవ్వకపోయినా ఇప్పుడు కాస్త అయినట్టే ఉంది. అయికూడా నేనింకా అలాగే ఉన్నా!!

తెలుగుకి కాస్త విరామం ఇచ్చి దేవభాష వైపు మళ్ళిద్దాము దృష్టిని. అసలు ఈ పద్యం చెప్పాక తెలుగుకి, సంస్కృతానికి ఎంత సామ్యముందో తెలుస్తుంది. ఈ పద్యాన్ని బర్తృహరి వ్రాసాడు. విద్య విషిష్టతని చెప్పే పద్యము. ఈ పద్యాలనే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించాడు. ఇప్పుడు రెండు పద్యాలు వినిపిస్తాను. రెండిటిలో ఎంత తేడా ఉందో చూడొచ్చు.

శా విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యాభోగకరీ యశస్ సుఖకరీ విద్యా గురూనాం గురు
విద్యాబంధుజనే విదేశగమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన: పశు:

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఇదిగో,
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశబందుడున్,
విద్య విశిష్ట దైవతము , విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగని వాడు మర్త్యుడే!!

పై రెండు పద్యాలలో ఎన్నో ఉపమా అలంకారాలున్నాయి. లక్ష్మణ కవి ఎన్ని ఉపమానాలని మార్చాడో చూడండి. తెలుగు ఉచ్ఛారణలోను, వాడుకలోను సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుందనడానికి చక్కటి ఉదాహరణ.
మొత్తం మూడు పద్యాలు తలుచుకున్నంతలోనే ఇంత పెద్ద వ్యాసం అయిపోయింది. ఇంక నాకు ఎంతో ప్రీతిపాత్రుడైన పోతరాజును తలుచుకోనే లేదు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంతే, ఈ పైత్యం తగ్గక పోతే ఇంకో రెండు మూడు పార్ట్ లు వచ్చే అవకాశం ఉంది.

కందమా!! మకరందమా!!  

Posted by దైవానిక

ఈ మధ్య చాలా కందాలు చూసి నాక్కూడా వ్రాయలని ఎందుకో అనిపించింది, లేడికి లేచిందే పరుగ్గా ఠకఠక వ్రాసేసాను(అంటే ఒక్కోదానికి ఒక గంటపయినే పట్టింది). అసలు కందము వ్రాయగల్గడమే ఒక వరము. ఒక్కసారి మొదలెట్టామో ఇక వరసగా అన్ని కందాలే. కాందాలు వ్రాయడానికి రూల్స్ కావాలంటె ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. చూస్తానికి చాలా కష్టమయిన రూల్స్ లా అనిపించినా, వ్రాసినప్పుడు అనుకున్నంత కష్టము(అంటే చాలా కష్టం కాకుండా, కొంచెం కష్టం అని) కాదేమో అనిపిస్తుంది.

సర్వ భగాణాలంకృతమైన కందమును నే కూడా కాస్త పొగిడితే ఇదుగో ఇలాగే ఉంటుంది

కందము నందము జూచితి
నందము బ్లాగున్, చిటుకున నల్లరి పదముల్
చిందర వందరగ మదిన్
తొందర పెట్టిన విధము నె తొరపడి బల్కెన్

కందమనగానే మనకి సుమతి శతకము గుర్తు రావాలి. నీతి ఎంత చక్కగా కందంలో ఉంటుందో చూస్తె, మనక్కూడా కొన్ని నీతులు చెప్పలనిపీయడం ఖాయం. అలా నీతులు చెపితే ఇదుగో ఇలా

చెప్పిన మాటలు మరలున
జెప్పిన తడవే విరివిగఁ జెప్పులు విసురున్
గొప్పలు మెండుగ బల్కిన
తిప్పలు తప్పక బడబడ తిట్టును జనులున్

పై రెండు రాసాక ఇంకా వ్రాయాలన్న తృష్ణ( అది చాలా పెద్ద పదమేమో, కోరిక అంటె సరిపోదు) చావక ఇదుగో ఇలా బయట పడింది.

మెడలో బంగారు గొలుసుఁ
జడలో చామంతి పూలుఁ జక్కగ పెట్టిం
గుడిలో కనపడెఁ , పిమ్మట
వొడిలో పసికందు జూచి వుడికెను మనసున్

అక్షింతలు వేయించుకోడానికి సిద్ధముగా ఉన్నానోచ్..

కథ కథ కందిత్తు  

Posted by దైవానిక

కొత్తపాళీ గారిచ్చిన కథా విషయం ఆధారంగా వ్రాసిన కథ. ఏమి కథో ఏమో వ్రాసే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది.

*********************************************
పెళ్ళి, ఈ మాట వినగానే ఒకప్పుడు ఒళ్ళు పులకరించి, ఆనందంలో మునుగి తేలేవాడిని. కొత్త జీవితం గూరించి కొత్తకొత్తగా ఊహించి కలల్లో తేలిపోయాను. కాని పెళ్ళి వెనుక దాగి ఉన్నా కష్టాలు అప్పుడేనాకు తెలియలేదు. ఉద్యోగం చేసే భార్య అయితే కష్టసుఖాల్లో అండగా ఉంటుంది అని, వెతికి ఏరికోరి చేసుకున్నాను. పెళ్ళి కాకముందు కన్న కలలు పటాపంచలవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. పెళ్ళయి ఇద్దరము ఉద్యోగములో తిరిగి చేరిపోయాము. తను ప్రొద్దున్న లేచి 8 గంటలకల్లా ఆఫీసుకి బయలుదేరేది. నేను తొమ్మిదింటికి లేచి ౧౦ కొట్టేసరికి చేరుకునేవాడిని. ఇక ఇంటికి రాగానే సుప్రభాతం మొదలు. తుడుచుకొని తువ్వాలు ఆరెయ్యలేదు, విడిచిన బట్టలు బుట్టలో వెయ్యలేదు, నిన్నటి సాక్సులు ఇంటినిండా విసిరారు .. ఇలా ఒకటే తగువు. ఇక ఉండబట్టలేక ఒకసారి మా అత్తగారికి కూడా కంప్లైన్ చేసాను." మీ అమ్మాయి ఇలా ఇంటికి వచ్చిన వెంటనే తిట్టడం మొదలెడుతుందండీ" అని, దానికి మా అత్తగారు, స్పీకర్ ఫోనులో నేనూ వింటున్నానని తెలిసికూడా, "చూడమ్మా సురేఖ, వచ్చిన వెంటనే తిట్టకూడదు. పలహారం, టీ, కాఫీ ఇచ్చి తరువాత సావకాశంగా మొదలెట్టాలి, సరేనా?" అని బహుబాగా బుద్ది చెప్పింది. ఇక ఉండబట్టలేక ఒకరోజు నేను కూడా నోటికి వచ్చిన నానా కూతలు కూసాను. ఒక దుమ్ము దుమారం లేచింది. తెగె దాకా లాగకూడదంటారు అందుకేనేమో

**************************************

పెళ్ళి అన్నది ప్రతి అమ్మయికి మరచిపోని రోజు, ఆ రోజు నా జీవితంలో ఇంత త్వరగా వచ్చేస్తుంది అన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి ఒక 10 కిలోల బరువు పెరిగేసాను. ఆ బరువు తగ్గడానికి ఎక్కువరోజులు పట్టనే లేదు. మా ఆయన సుచి శుభ్రానికి పెట్టింది పేరు. ఎక్కడ తీసినవి అక్కడ పెట్టడం అలవాటేలేదు కాని చేసిన వంటలకి పేర్లు పెట్టడం మాత్రం బాగా వచ్చు. ఒకరోజు బెండకాయ కూర చేస్తె, బెండకాయలు వేస్తే ఇంకా బాగుండేది అని సెటైరు. ఇంకో రోజు, ఇండియన్ చెయ్యి, ఫ్రెంచి, ఇటాలియన్ మెక్సికన్ ఎందుకు? అన్నారు చక్కగా సొరకాయ పులుసు చేస్తె. మళ్ళా నేను శుభ్రంగా ఉండలేదన్నాని మా అమ్మకి కంప్లయిన్ కూడా చేసారు. మా అమ్మకే నా మీద ఇన్ని చెప్తే, మా అత్తగారికి ఎన్ని చెప్పాడో. అసలే ఆవిడ, తను ఆప్యాయంగా పెంచిన కొడుకుని తెగ కష్టపెడుతున్నాని ఫీల్ అవుతూ ఉంటది. ఇవన్ని తలుచుకొని నాకు బాగా తిక్కరేగింది. ఈ రోజు తాడో పేడో తేల్చుకుందామని తీర్మానం చేసుకున్నాను.
అవకాశం రానే వచ్చింది. మా ఆయన చొక్కాకి గుండీ ఊడి క్రింద పడి దొరికింది. నాకు చిర్రెత్తింది. నానాతిట్లు తిట్టాను. మామూలుగా విని ఊరుకునే ఆయన నన్ను రివర్సులో తిట్టడం మొదలెట్టారు. నాకు ఇంకా ఒళ్ళు మండింది. చిలికి చిలికి గాలి వాన అయ్యింది. నాకు డైవోర్స్ ఇస్తానన్నారు. " ఇస్తే మీకే నష్టం, నాకేం లేదు. హాయిగా బ్రతకేస్తాను" అన్నాను. "నేను నీ పీడ వదిలినాక, మా ఆఫిసులో రమ్యని పెళ్ళి చేసుకొని హాపీగా గడిపేస్తాను" అన్నారాయన. నాకు కోపం హద్దులు దాటింది,
" రోజు ఇంటికి లేటుగా వస్తుంటే, పని వత్తిడి అనుకున్నాను కానీ ..."
"కానీ, అనేసెయ్, మళ్ళా అక్కడ ఆగావే, ఈ రోజు ఎటో మన పెళ్ళి పెటాకులే"
"పెటాకులు కాక ఇంక ఏం మిగిలింది, కాని నన్ను వదిలేసి, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుంటే, చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా?"
" ఊరుకోక ఏం చేస్తావు.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో"
" ఏం చేస్తానో చూద్దువు గాని, ఒరేయ్ రవిగా నీకు మళ్ళ పెళ్ళి ఎలా అవ్వుద్దో నేను చూస్తా" అని నా పెట్ట బేడా సర్దుకొని బయలుదేరాను. ఆయన కనీసం ఆపనూలేదు

************************************

ఎందుకు ఆరోజు అంత కోపం వచ్చిందో తెలియనే లేదు. తను వెళ్ళిపోతుంటే ఆపాలని కూడా అనిపించలా. కాని ఆటో అటు తిరిగిందో లేదో, గుండె జారిపోయింది. నేనన్నవన్ని అబద్దం అని చెప్పాలని ఉంది. రమ్య లేనే లేదు అని, తను లేకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవదని కూడా చెప్పాలి. కాని ఎందుకో బాధతో గొంతు మూగబోయింది. అలా రెండు రోజులు గడిసాయి. మా ఆవిడ జాడ ఎక్కడా లేదు, మా అత్తగారింటికి ఫోను చెద్దామంటే ధైర్యం లేదు. ఎలా అని ఆలోచిస్తూ అలాగే గడిపేస్తున్నా..
**********************************

నాకు ఎటెళ్ళాలో కూడా తెలియలేదు. మా ఇంటికి వెళితే, సర్థి చెప్పి తిరిగి తీసుకొచ్చి దిగబెడతారు. ఏం చెయ్యాలో ఆలోచిస్తుండగా, నాకు ఆ దేవుడే దిక్కనిపించింది. మా ఆయనకి బుద్ధి చెప్పాలని, కాని ఈ మగాళ్ళంతా ఇంతే, ఏదన్నా చెయ్యాలని ఉక్రోషం తట్టుకోలేకపోయాను. వెంటనే ఒక అయిడియా వచ్చింది. జీవితాన్నే మార్చేసే అయడీయా. బాంక్లో డబ్బులు డ్రా చేసు స్టేషన్ కి చేరుకున్నాను.

*************************************

ఇవ్వాళెందుకో మా ముసలాయన బాగా కంగారుగా ఉన్నాడు. ఎప్పుడు నాతోటి ఏదో వ్రాస్తు ఉండే వాడు, ఇవ్వాళ నన్ను ఒక్కసారి కూడా ముట్టుకోలేదు. అప్పటికి అక్కడ ఇక్కడ ద్వార పాలకులు, దేవతలు మాట్లడగా విన్నా, నాకెందుకో నమ్మబుద్ది కాలేదు. గత కొన్ని రోజులుగా ఏ గొడవ లేదు, మళ్ళి ఇప్పుడు సడన్ గా ముసలాయన దిగులు చూడలేకున్నాను. ఎవరయినా ఘోర తపస్సు చేసినప్పుడల్లా మా ముసలాయన బాధ వర్ణనాతీతం. వాళ్ళు ఏ వరం అడిగితే ఏమి వరాలివ్వాలో ఈయిన ఇలా తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. అసలు మానవులకి ఇలాంటి బుద్ధి పుట్టివ్వడం ఎందుకు, తిరిగి ఆలోచించడం ఎందుకో నాకర్థం కావట్లేదు. కాని ఈ సారి తపస్సు చేస్తున్నది ఒక అమ్మాయంట, దాదాపు చాలా రోజుల నుండి చేస్తుంది. ఇక ఇప్పుడో అప్పుడో ముసలాయన దర్శన భాగ్యం లభిస్తుంది. మా ముసలాయన నన్ను తీసుకెల్లకుండా వెళ్ళడు. అంతలోనే నన్ను చేతిలో పట్టుకొని బయలుదేరాడు. అమ్మాయి బాగా నీరసంగా ఉంది. ఇప్పుడా, ఇంకాసేపా ప్రాణం అన్నట్టుగా ఉంది. యాస్ యూశ్వల్ గా మేము అమ్మాయి కలలో కనపడ్డాము. అమ్మాయి ఆనందంతో ఒక్కిరి బిక్కిరి అయ్యింది.
" సురభి, నీ ఘోర తపస్సుకి గల కారణం?" అన్నాడు ముసలాయన. అన్ని తెలిసే ఈ నాటకాలెందుకో అనుకున్నాను.
"స్వామి, మీకు తెలీదా?"
"...." ఒక దీనమైన మొహం పెట్టాడు. ఆ మొహం చూస్తే అడగాల్సిన కోరికలన్ని మరచి జాలి కలుగుతుంది పాపం.
"అదే స్వామి, భూలోకంలో ఈ మగవారి బాధ భరించలేకపోతున్నారు ఆడవాళ్ళు. అందుకని మాకు కొన్ని స్పెషల్ పవర్స్ కావాలి"
" చూడమ్మా, నేను మనుషులని తయారు చేసినప్పుడే, ఇద్దరికి సమానమయిన పవర్స్ ఇచ్చాను, స్పెషల్ పవర్స్ ఇచ్చి ఇంకోకరికి ద్రోహం చెయ్యలేను"
"ఇది చెప్పడానికేనా ఇంతదూరం వచ్చింది"అన్న ఆమె కళ్ళలో కోపం చూసి ఇద్దరము దడుచుకున్నాము.
"సరె తల్లి నేను దీనీకి పర్యావసనం చెబుతాను. నీ కోరిక తీరడానికి నువ్వు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. నువ్వు ముందు కోరిక చెప్పు, ఏమి వదులుకోవాలో నేను తరువాత చెబుతాను" అమ్మ ముసలోడా, వేసావ ముడి. పాపం ఈ అమ్మయి బలైనట్టే. నెనెన్ని సార్లు చూడలేదూ.
"స్వామి, ఆడవాళ్ళు మగవాళ్ళని చూడగానే వారి చెడులంతా వారి మొహం మీద కనపడాలి స్వామి. ఆ రకంగా ఆడవారు మోసపోవడం జరగదు"
"ఆడవాళ్ళందరి గురించి నీకెందుకమ్మా, నీకు ఇస్తాను కావాలంటే"
"అదేం కుదరదు స్వామి. అందరికి ఇస్తే ఇవ్వండి లేకుంటే మీకు నాకు రాం రాం"
" సరే, దీనికి పర్యవసానంగా నువ్వు ఎక్కడికెళితే అక్కడ ట్రాఫిక్కు జాం జరుగుతుంది తల్లి."
"అదేంటి స్వామి, రెంటికి ఏమిటి సంబంధం. ఎక్కడా పోలిక కుదరట్లేదే??
"నీకు జరిగినదానికి, నువ్వు కోరిన కోరికకి సంబంధం ఉందా తల్లి? ఇదీ అంతే.. తథాస్తు" అని మాయమైపోయాం. ఇది మా ముసలాయన ట్రిక్కుల్లో ఒకటి. వాళ్ళకి ఎక్కువ చాన్సులివ్వడు. ఆ అమ్మాయి ఇంకా ఉంటే ఎమేమి అడుగుతుందో అని ఇలా చేసాడు. ఇట్టాంటోడు చస్తే మళ్ళా పుట్టడు.
********************************************
కళ్ళు తెరచి చూసే సరికి నాకు నిజమో అబద్దమో తెలియలేదు. నేను చూస్తే పుష్టిగా ఉన్నాను. వెంటనే నిజమో కాదో పరీక్ష చేయాలనిపించింది. అప్పుడు ఆలోచిస్తే, నేనున్నది ఈ కారడివిలో, కోరిక తీరినట్టే కాని దానికి ఆ లంకె వేసాడేంటి బ్రహ్మదేవుడు. వెంటనే మగవాళ్ళనెవర్నాన్నా చూడాలి అని బయలుదేరాను. మొత్తానికి చూసే సరికి అంతా నిజమే అని తెలిసింది. కాని ఎలా తెలిసిందో ఏమో, నా వళ్ళే ఇది జరిగింది అని ప్రపంచమంతా తెలిసింది. ఇది కూడా బ్రహ్మ దేవుని మాయ కాదు కదా!! మొత్తానికి దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్ చేరుకున్నాను. రైలెక్కానో లేదో, కాస్త దూరం వెళ్ళే సరికి, నది పోంగి రైలు కట్టంతా కొట్టుకుపోయిందట, ఎక్కడి రైళ్ళు అక్కడే ఆపేసారు. నేను రైళ్ళో ఉన్న మొగాళ్ళ నుదుర్లెంక చూస్తు కాలక్షేపం చేస్తున్నా. నా లాగే అమ్మాయిలంతా చేస్తున్నట్టున్నారు. నాకు ఒక పెద్ద అభిమాన సంఘం పెట్టేసారు. మహిళాలోకానికి నేనొక రత్నాన్నాన్నారు. ఒకటే ఇక ఇకలు, పక పకలు. అవి చదువుకొని మేము చేసే గోలకి మగాళ్ళంతా సిగ్గుతో తలలు దించుకుంటున్నారు. ప్రతి వాడు చేసిన ప్రతి తలకమాసిన పని మాకు చక్కగా కనపడుతుంది. మొత్తానికి ఎన్నాళ్ళయినా రైలు కదలక పోయే సరి, దగ్గర్లో ఉన్న ఊరు చేరాము. అక్కడ వరద ప్రభావమే లేదంటే ఆశ్చర్యం వేసింది. మేము ఊరు చేరగానే మాకందిన వార్తేంటంటే, నేను బయలు దేరిన కాసేపటికి రైలు కూడా బయలుదేరిందట.
ఊళ్ళో అప్పటికే నా వరం వళ్ళ సుబ్బరంగా 3-4 పెళ్ళిళ్ళు చెడిపోయాయి. పిల్లల అమ్మా నాన్నలేమో, తెగ బాధ పడిపోతున్నారు. ఇలా అబ్బాయిల మొహం మీద వాళ్ళ చరిత్రంతా కనపడితే, పిల్లలకి పెళ్ళి ఎలా అవ్వుద్దిరా భగవంతుడా అని. ఒక ఆమయితే ఏకంగా నన్ను బండ బూతులు తిట్టింది. " ఏమ్మా, నీకు పని పాటలేక ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరావా తల్లి. నీ పుణ్యమా అని మా పిల్లకి ఈ జన్మలో పెళ్ళి కాదు. అసలే కట్నం ఇస్తే పెళ్ళి చేసుకోనని మొండికేసి కూర్చుంది. ఇక నీ పుణ్యమా అని ప్రతివాడికి అడ్డమయిన వంకలు పెడుతుంది. నా ఉసురు నీకు తప్పక తగుల్తుంది. నీ పాపిష్టి మొహాన ఉమ్మెయ్యా. నీ ముదనష్టపు జన్మకు పెళ్ళి పెటాకులు లేవా?? నిన్ను తగలెయ్య" ఇలాఎన్ని తిట్టిందో ఆ దేవుడికే తెలుసు. నన్ను ఇన్ని అంటున్నా ఒక్కరు సపోర్ట్ చేస్తు రాలేదు. అప్పటికే ఎలా తెలిసిందో, నా ట్రాఫిక్కు జాం గురించి. రైలు ఆగడానికి నేనే కారణం అని తెలుసుకొని, నా అభిమాన సంఘాల వాళ్ళూ మెల్లగా నన్ను ఒక్కొక్కరే వదిలి వెళ్ళడం మొదలెట్టారు.
ఎలాగోలా, ఆ ఊర్లో బస్సు ఎక్కాను మిగిలిన నలుగురైదుగురితో. బస్సు హైవే చేరే సరికి అక్కడ ఒక పెద్ద ట్రాఫిక్ జాం. ఇలా అయితే మా ఊరు వెళ్ళేదెప్పుడొ అని నేను ఆలోచిస్తుండగా, వదంతి ఎలా పొక్కిందో కాని నా వళ్ళే ఈ ట్రాఫిక్ జాం అని అందరు అనుకుంటున్నారు. ఇంతలో ఒకావిడ, రయ్యిమంటు బస్సులోకి ఎక్కి నన్ను కోపంగా చూస్తోంది. ఆవిడ భర్తని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోఈ జాం అంట. నా వళ్ళే అన్న వదంతం విని వచ్చింది. తెలాంగాణా ఆవిడలా ఉంది. "ఓసి నీ నోట్లో మన్నుబొయ్య, నీ పుస్తెలు పుటుక్కుమనా, నీ దిపం గుటుక్కున ఆరిపోను. నీ బోంద బెట్ట" ఇలా ఒక అరగంట సాగింది తిట్ల భాగవతం. నేను మెళ్ళగా బస్సు దిగాను. అలా డొంక గుండా దిగానో లేదో, ట్రాఫిక్కు చటుక్కున కదలడం మొదలయ్యింది. ఇప్పుడూ పూర్తిగా నమ్మకం కలిగింది నాకు. ఇక మా ఊరి దాకా నడుద్దామనుకుంటున్నానో లేదో, టీవీల వాళ్ళు వచ్చేసారు. అన్ని యాంగిళ్ళలో నన్ను చూపిస్తున్నారు. అడగరాని ప్రశ్నలు...
*********************************
మా ఆవిడ నా మీద శపథం చేసి వెళ్ళి నాలుగు నెలలయ్యింది అప్పుడే. వెతకని చోటులేదు. మా అత్తగారు మామగారు, నా మీద పోలీసు కేసు కూడా పెట్టారు. కావాలిస్తే నీకు మా ఆస్తంత ఇస్తాం మా అమ్మయిని ఏం చేసావో చెప్పమని ఒకటే వత్తిడి. నేను నిజం చెప్పి ఆ తరువాత నాకు తెలీదు కుయ్యో మొర్రో అన్నా వాళ్ళు వినలేదు. పోలీసు వాళ్ళు కూడా ప్రైమరీ ఇన్వేస్టిగేషన్ తరువాత, నాకు నిజంగా ఏమి తెలీదని వదిలేసారు. నాకు మా ఆవిడ ఏమయ్యిందో అని ఒకటే ఆందోళన. ఇంతలో ఒక నాడు టీవీలో కనపడ్డది. మగాళ్ళ మొహాన వారి చరిత్రంతా కనపడ్డానికి కారణం ఈవిడే అని, పెళ్ళిళ్ళన్ని పెటాకులవడానికి ఈవిడే కారణం అని చూపిస్తున్నారు. ఒకొక్కరు ఒకొక్క టైటిల్ పెట్టారు. "దేవుని కృపతో దయ్యమా?" అని ఒకరు, "మనిషి చేసిన అమానుషం అని ఒకరు" ఇలా. కొందరు మహిళలు నానా తిట్లు లైవ్ తిడుతున్నారు. వెంటనే వాళ్ళు చెప్తున్న ఊరుకి బయలుదేరాను.
************************************

నా బ్రతుకు మరీ దుర్బరమయ్యింది. నేనెక్కడ నిలిస్తే అక్కడ పంచభూతాలు తాండవం చేస్తున్నాయి. ఇది చూడలేక, దాన్ని తట్టుకోలేక టీవీ వాళ్ళు కూడా మాయమయ్యారు. కాని ఆకలి మండుతోంది. నన్ను చూడగానే జనం పారిపోయి తలుపులేసుకుంటున్నారు. అయ్యో భగవంతుడా లోకానికి మంచి చెయ్యబోతే ఇలా నాకు చెడు చేసావు తండ్రీ అని ఎంత బాధపడ్డాను. బ్రహ్మ దేవుడు మళ్ళా ప్రత్యక్షమై ఈ వరం వెనక్కి తీసుకుంటే బాగుండుననుకుంటున్నంతలో మా ఆయన దూరంగా కనపడ్డాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన్ని పట్టుకున్నానో లేదో ఒక్క అరుపు వినిపించింది,
" ఏమేవ్, టైం తొమ్మిది దాటింది. నిన్ను చూసుకోడానికి పెళ్ళి వాళ్ళొస్తున్నారు కదా, ఇక లేచి పనులు కానీ" అని మా అమ్మ కేకలు. అప్పుడు ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను. వెంటనే పగటి కల కళ్ళముందు కదిలింది. హమ్మయ్యా ఇది కాలా, అయినా ముగ్గురు మనుషుల్లాగా నేనే కలలు కనడమేమీటి చెప్మా, కొంపదీసి, మల్టిపుల్ పర్సనాలిటి డిసార్డర్ కాదు కదా!!!!!!

(సమాప్తం)

తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా  

Posted by దైవానిక in

ఎందుకో కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని డయిలాగులు అలా నోట్లో నానుతుంటాయి. చిన్నపిల్లలప్పుడయితే వాటి అర్థాలు కూడా సరిగ్గా తెలియవు. మజ్ను సినిమా మొదట చూసినప్పుడనుకుంటాను, చాలా రోజులు వాడిన డయిలాగు "కామా తురాణాం న భయం న లజ్జ". దాని అర్థం ఏమిటో తెలియని వయసు నాది. ఎవరేమన్న నోటినుంచి ఇదే డయిలాగు. చివరకి ఒకసారి మా అమ్మకి కూడా వినపడ్డది. అప్పుడు మా అమ్మ పిలిచి దాని అర్థం తెలుసా అని అడిగింది. నేను తెలీదన్నాను. అప్పుడు తెలీని పదాలు, అదికాక వయసుకిమించినవి మాట్లాడడం తప్పుకదా అని సముదాయించి పంపింది.

తర్వాత కొన్నాళ్ళకి సాగరసంగమం సినిమా చూసాను. కమల్ చెప్పిన డయిలాగులు, చెప్పిన తీరు భలే బాగా నచ్చెసాయి. ఈ సారి పట్టింది, " ఇలాంటి కామక్రీడలు చెయ్యడానికి వీళ్ళకి సిగ్గులేదు". ఇక ఇది నోటెమ్మట వస్తూనేవుంది. నోరుజారి అమ్మముందు కూడా అనేసాను. నోరు జారడానికి చెంప పగలడానికి పెద్ద సమయం పట్టలేదు.. ఈ పెద్దోళ్ళున్నారే, మా చిన్నోళ్ళని ఎప్పుడు అర్థం చేసుకోరు. ఏదొ పెద్దమాటలన్నానని చెంప పగలగొట్టడం ఏం న్యాయం అని బాగా ఆలోచించి ఏడ్చి పడుకున్నాను.
ఇంకొన్నాళ్ళకి, అప్పుడు నా వయసు 12-13 ఉంటుందనుకుంటాను, రాత్రి కలలో గట్టిగా "నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు" అని అరిచానంట. ఇక రెండు మూడు రోజులు క్లాసులు. అసలు పెళ్ళి ఊసులు రావడానికి కారణం రాబట్టడానికి గట్టి ప్రయత్నాలు జరిగాయి. కాని అసలు అరిచిన సంగతే గుర్తులేదు. ఇంకా కారణాలు ఎక్కడనుంచి చెబుతాను.
ఈ పై విషయాలు గమనించి, నాకు కామానికి అక్రమ సంబంధం ఉందనుకునేరు. అంతా కేవలం యాథృచ్చికమే.

సరే అసలు టైటిల్ విషయానికొస్తే, పాండవ వనవాసం సినిమా చూసినప్పుడు విన్న డవిలాగు అది. సావిత్రి బాగా బాధ పడుతూ చెప్పిన డయిలాగు. ద్రౌపదిని( అదే సావిత్రే లెండి) తీసుకురమ్మని ప్రాతిగామిని పంపిస్తాడు రారాజు. అప్పుడు ఈ విషయం కనుక్కురమ్మని సావిత్రమ్మ చెప్పే డయిలాగు ఇది.
" నా స్వామి తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా,".
ఈ డయిలాగు విన్నప్పుడు నేను, ధుర్యోధనుడు( అదే మన ఎస్ వీ ఆర్) ఒకలాగే ఆలోచించాము. ఎలా అయితే ఎంటి మొత్తానికి ఓడారా లేదా. అంతా టైం వేస్టింగ్ టాక్టిక్స్.
కాని రెండిటికి ఏంత తెడా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది. అంటె ధర్మరాజు తను ఓడిపోవడం వల్ల ద్రౌపది ఆటోమేటిక్ గా రారాజుది అవుతుంది. అలాంటప్పుడు ధర్మవిధిత(lawful bid). కాని, ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పెట్టి ఓడిపోతే, అసలు ధర్మ రాజుకు ద్రౌపదిని పెట్టే హక్కు ఎక్కడిది. ద్రౌపది తన ఒక్కడికే భార్య కాదే, కాబట్టి తను అధర్మవిధిత( unlawful bid). ఇది వికర్ణుడు చెప్పే వాదం. ఏదేమయితేనేం ఇందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది. అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు.