ప్యాలేస్ గ్రౌండ్స్ లో పుస్తకాల వేట  

Posted by దైవానిక

పోయిన వారం బెంగుళూరు పుస్తకాల పండగ(bangalore book festival) ప్యాలేస్ గ్రౌండ్స్ లో జరగనున్నాయని, అన్ని భాషా పుస్తకాలు లభిస్తాయని వార్తపత్రికలో చదివి తప్పకుండా వారంతం వెళ్ళాలని నిర్ణయించేసాను. బెంగుళూరులో తెలుగు పుస్తకాలు దొరకడమే మహాభాగ్యం. వెంటనే పూర్తిగా ఈ సౌకర్యం వినయొగించుకోవాలని అనుకున్నాను, కాని ప్యాలేస్ గ్రౌండ్స్ లో అంటేనే గుండె గుటుక్కుమంది. మొన్ననే అక్కడ రెండు రోజులు ట్రాఫిక్కు జాం అయ్యి సుమారు 5 గంటలు జనాలు ఇరుక్కుపోయారు. కాని పుస్తకాల కోసం అందునా తెలుగు పుస్తకాల కోసం ఎంతటి ప్రయాసనయినా అనుభవించాలనే డిసైడ్ అయ్యాను. అసలే కొనాల్సిన పుస్తకాల లిస్టు బాగానే ఉంది. మా ఓరుగల్లు విశాలాంధ్రలో, ఏ పుస్తకం అడిగినా లేదండి అని ఒకే సమాధానం చెప్తున్నారు. కనుక ఎటువంటి అవాంతరాలొచ్చినా వెళ్ళి తీరాల్సిందేనని తీర్మానించటం జరిగింది. తోడు ఎవరన్నా వస్తారేమోనని ఆలోచించా, బుక్ ఫెస్టివల్ కొచ్చెవాళ్ళు ఎవరూ ఊళ్ళో లేకపోవడం వల్ల ఒక్కడినే బయలుదేరాల్సొచ్చింది. బెంట్రామ ( బెంట్రామ: బెంగుళూరు ట్రాఫిక్కు మథనం, ఇది కావించిన ఇహంలోనే నరకప్రాప్తి లభించును) గావించుటకు మిట్ట మధ్యాహ్నం బయలు దేరా, మిట్ట మధ్యాహ్నం అయితే ట్రాఫిక్కు ఎక్కువ ఉండదులే అని. కాని నేనొక వెర్రిమాలోకాన్ని అని మొదటి జంక్షన్ చేరగానే తెలిసింది. బెంగుళూరులో జనం వారాంతం అనగానే మిట్ట మధ్యాహ్నం దాకా నిద్దరోయి, సూర్యుడు నడి నెత్తికి వచ్చినప్పుడే బయటకి వస్తారన్నమాట. ఎలాగోలాగ, తలలో పేను దూసుకెళ్ళినట్టు దూసుకెళ్ళి ఒక గంటలో చేరుకున్నాను. బుక్ ఫెస్టివల్ అంటే ఖాళీగా విలవిలలాడుతుందనుకున్నాను కాని జనం యిరగున్నారు. మొదట కాస్త ఆశ్చర్య పడినా తరువాత ఆనందపడ్డాను. ఎంట్రీ టికెట్టు, అదీ ఇరవయ్యి రూపాయలనే సరికి, జనాలు డబ్బు కట్టి మరీ ఇంత మందొచ్చారని ఇంకాస్త సంతోషపడ్డాను. ఇక దాడి ఆరంభించాను. ఒక 5,6 షాపులు దాటగానే తెలుగు పుస్తకాల షాపుంది. అబ్బ అని అటాక్ చేసా. నేను కొందామనుకుంటున్న చాలా పుస్తకాలు కనపడ్డాయి. వాటి వివరాలు ఇక్కడ.
1. భారతంలో చిన్ని కథలు , రచయిత: ప్రయాగ రామకృష్ణ , పబ్లిషర్: ధరణి ప్రింటర్స్ , వెల: 150
ఈ బుక్ కోసం చాలారోజులుగా వెతుకుతున్నాను. స్నేహితుడొకడు చెప్పగా విని కొనాలని చాలా రోజులుగా ప్రయత్నించాను. వరంగల్లు లోని విశాలాంధ్ర వారు తెప్పిస్తానని చాలా రోజులుగా దాటేస్తున్నారు. కాని పుస్తకం చదివాక (చదివినంతవరకు) చాలా కథలు తెలిసినవే ఉండడం నన్ను కాస్త నిరుత్సాహ పరచింది. ఇంకా చాలా కథలే ఉన్నాయి. పూర్తిగా చదివితే గాని చెప్పలేను. రచయిత "వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ" అని రేడియేలో వినపడే ఆయినేనా అన్న అనుమానం తీరలేదు.

2. శతక రత్నాకరము - గుంటూరు వీరరాఘవశాస్త్రి - బాలసరస్వతి బుక్ డిపో - 150 -
అలా పుస్తకాలు చూస్తుంటే ఇది తగిలింది. ఈ మధ్య నా పద్య పైత్యం గురించి ముందే చెప్పాను కదా.. చూసిన వెంటనే కొనేసాను. దీనిలో చాలా శతకాలున్నయి. కొన్నిటి పేర్లు కూడా వినలేదు, ఉదా:- కీరవాణి శతకము, జనార్థన శతకము, కుమారీ శతకము. దాదాపుగా ౩౩ శతకాలున్నాయి. ఇన్ని ఒకచోట దొరకడం అదృష్టమే. కాని వాటికి తాత్పర్యాలు లేవు. నా తెలుగు మీద నాకంత నమ్మకమా!! అని ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నాను. అయినా పదాలకి అర్థాలు తెలియకపోతే బ్రౌణ్యముండనే ఉంది, ఇంకా అర్థం కాకపోతే బ్లాగుల్లో చాలామందున్నారన్న నమ్మకం.

3. రంగనాయకమ్మ నవలలు: పబ్లిషర్: స్వీట్ హోంపబ్లికేషన్స్
చదువుకున్న కమల - 15
ఇదే నా న్యాయం - 50
బలిపీఠం - 60
జానకి విముక్తి - 125
రంగనాయకమ్మ గారి నవలలు చదవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మన సుజాత గారి మాటలు విన్నాక, మొన్నా మధ్యన జరిగిన చర్చ చూసాక ఆవిడ పుస్తకాలు కొనాలనే నిర్ణయం బల పడింది. కాని ఏమి కొనాలో తెలీలేదు. విషవృక్షం కోందామంటే, సైజు చూసి కొంచెం దడుచుకున్నాను. మొదట వేరేవి చదివి ఆ తరువాత అది చదువుదాములే అని ఆ నాలుగు కొన్నాను. ఎలా ఉంటాయో ఏమిటో??

4.పెద్దబాలశిక్ష - పోతూరిసీతారామాంజనేయులు- టాగూరు పబిషింగ్ హౌస్ - 27
వెనకట పెద్దబాలశిక్షలేని ఇల్లు ఉండేది కాదట. ఇంతకు ముందు నా రూమ్మేట్ దగ్గర ఉండేది. అసలు అందులో లేనిది లేదంటే ఆశ్చ్రర్యపోనక్కరలేదు. అది చూసి చాలా నచ్చేసింది. వాస్తు గురించి, సామెతలు, కవుల గురించి, తిథులు, ఒక్కటేమిటి లేనిదుండదు. చాలారోజులుగా కొనాలనుకుంటున్న మరో పుస్తకం ఇది. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. మన ఇంట్లో తప్పకుండా ఉండవలసిన పుస్తకం.

5. అమరావతి కథలు - సత్యం శంకరమంచి - నవోదయా పబ్లిషర్స్ - 175
అమరావతి కథలు గురించి తెలియనిదెవ్వరికి చెప్పండి. మా చిన్నప్పుడు దూరదర్శన్ లో అమరావతీ కి కథాయే అని హిందిలో వచ్చేవి. భళేగా ఉండేవి. చాలా మంది తెలుగు నాయికానాయకులుండడంతో ఇంకా ఆసక్తిగా చూసేవాణ్ణి. అశోక్ కుమార్ చాలా వాటిల్లో ఉండేవాడు. ఇవి టీవిలో చూడడమే కాని చదివిన పాపాన పోలేదు. బుక్ అక్కడ కనపడిన వెంటనే ఠక్కున పట్టుకున్నాను. చదవాలి .. బాగుంటాయని గట్టి నమ్మకం.

6. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - విశాలాంధ్ర - 100
అక్కడ పుస్తకాలమ్మే అతని గట్టి రికమండేషన్, తప్పకుండా చదవి తీరాలన్నాడు. ఇంతకు మించి నాకు రచయిత గురించి గాని కథల గురించి కాని ఏమి తెలియదు. బాగుంటాయనే అనుకుంటున్నాను

7. నవ్వితే నవరత్నాలు 1&2 - మల్లిక్ - ఎమెస్కో బుక్స్ - 50
మల్లిక్ అంటే హాస్యానికి పెట్టింది పేరు. అందుకని కొన్నాను. అందుకే కాదులే, ఎందుకో మల్లిక్ అంటే కాస్త అభిమానం. బాగుంటాయని నమ్మకం కూడా.

8. అంపశయ్య - నవీన్ - ప్రత్యూష ప్రచరణలు - 120
నవీన్ గురించి చాలా విన్నాను. అతని చైతన్యస్రవంతి గురించి కూడా. అంపశయ్య గురించి కూడా. 60 లలో విధ్యార్థుల గురించి, వాళ్ళ విప్లవాల, ఆలోచనల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఈ పుస్తకం కొనడం జరిగింది.

9. టాగోర్ గీతాంజలి - చలం - అరుణా పబ్లిషింగ్ హౌస్ - 30
ఈ పుస్తకం చూడగానే చలం గీతాంజలిని అనువదించాడా, అయితే తప్పక చదవాలని తీసుకున్నాను. చలం ఇంటర్ప్రెటేషన్ చదవాలని కొన్నాను.

10. బుడుగు - ముళ్ళపూడి వెంకటరమణ - విశాలాంధ్ర - 90
బుడుగు గురించి గాని రమణ గారి గురించి కాని ఇంట్రడొక్షన్ ఇవ్వడం దుస్సాహసమే అవుతుంది.

ఇదండీ నా పుస్తకాల వేట. అన్ని పుస్తకాల మీద 10% రాయితీ వచ్చింది. నేను విశాలాంధ్ర మెంబర్ ని అవ్వడం వలన వాళ్ళ పబ్లికేషన్స్ మీద 20% రాయితీ లభించింది. ఇన్ని పుస్తకాలకి కేవలం ఒక సహస్రం మాత్రమే అవ్వడం అమితానందాన్నిచ్చింది. నేను హ్యారీపోటర్ ఒక్క పుస్తకం 975 పెట్టి కొన్నాను. ఇప్పుడు దాదాపుగా అదే ధరకి నాకు 14 పుస్తకాలొచ్చాయి. (మాలతి గారు వింటున్నారో లేదో, మేమూ పుస్తకాలు కొంటున్నాం). మళ్ళి సంవత్స్రరం తప్పకుండా వస్తానని షాపతినికి చెప్పి 5 కిలోల పుస్తాకలు పట్టుకొచ్చాను(కిలోలంటున్నాని ఆశ్చర్యపోకండి. బెంగుళూరులో అన్ని కిలోల లెఖ్ఖే..కిలో నారింజ పళ్ళు, కిలో సొరకాయి, కిలో పుస్తకాలు. ఈ పుస్తకాలన్ని బాగా చదివాలని, ఎవ్వరు అప్పివ్వమని అడగకూడదని, ఒకవేళ వాళ్ళడిగినా నేనివ్వకూడదని, ఒకవేళ నేనిచ్చినా వాళ్ళి తిరిగిచ్చేయాలని అప్పుడే దేవిడికి దణ్ణం కూడా పెట్టేసాను. అయినా నా అమాయకత్వం కాని ఇవన్ని మనచేతుల్లోనే ఉన్నాయని గ్రహించలేకపోయాను. కొన్నానని ఎవరికైనా చెప్తే కాదా హి హి హి

This entry was posted on 24, నవంబర్ 2008, సోమవారం at 9:29 AM . You can follow any responses to this entry through the comments feed .

9 comments

మీరు చెప్పిన వాటిలో చాల పుస్తకాలు జిల్లా గ్రంధాలయాలలో కూడా దొరుకుతాయని నా అభిప్రాయం.. మొన్న నేను వైజాగ్ లోని బుక్ ఫెస్టివల్ కు వెళ్ళినప్పుడు కుడా అవసరమైన పుస్తకాలు నిజంగానే దొరక్క కొంచెం ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా గౌతమ బుద్దుని మీదా , అశోకుని మీదా ప్రామాణికమైన పుస్తకాలు తెలుగు లో నిజంగానే ఎంత వెతికినా దొరకడం లేదు..
నేను చూసిన వాటిలో మంచి పుస్తకాలు కొన్ని
గణపతి- చిలకమర్తి వారిది
గోరువంకలు- బాల గంగాధర్ తిలక్
ది మిల్ ఆన్ ది ఫ్లాస్ -జార్జ్ ఇలియట్
రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు
విశాలాంద్ర వారి తెలుగు కథ కుడా నచ్చింది..
మంచి టపా రాసారు... ధన్యవాదాలు

24 నవంబర్, 2008 11:01 AMకి

నాదీ బెంగళూరయినా, మొన్న వారాంతం మా వూరెళ్ళాను. శనివారం మా వూరు విశాలాంధ్ర లో చెప్పారు, బెంగళూరులో పుస్తక ప్రదర్శన, నిన్న (ఆదివారం) ఆఖరు రోజు అని. ఛ అనుకున్నా..

మంచి కలెక్షన్.

24 నవంబర్, 2008 11:12 AMకి

నవ్వితే నవ్ రత్నాలు నేను కొన్న, కొనటానికి మొదటి కారణం మల్లిక్. పుస్తకాలు చదవటం మొదలు పెట్టిన దగ్గరనుండీ నాకు హాస్య విభాగంలో బాగ నచ్చిన రచయిత మల్లిక్. కాని ఈ పుస్తకాలు మాత్రం నన్ను నిరాశ పరిచాయనే చెప్పవచ్చు. మీరు చదివిన తర్వాత మీ అనుభవం మాతో పంచుకోండి

బుడుగు బాగుంది కాని రీ-పబ్లిషింగ్ వల్ల ఏదో మిస్ అయ్యింది అనిపించింది. నేను నా చిన్నతనంలో లైబ్రరీ నుండి తెచ్చుకునీ చదివిన బుడుగుకీ, ఇప్పటి బుడుగుకీ ఏదో తేడా.

ఏది ఏమైనా "Happy Reading :)"

24 నవంబర్, 2008 1:07 PMకి

వావ్! బోలెడు కొనేసారన్నమాట. బలిపీఠం మొదట్లో కొంచెం బోరు కొడుతుంది, ఆ యుద్దం కథా అదీనూ! కానీ తర్వాత బాగుంటుంది. మొత్తం మీద నవల కంటే సినిమా నచ్చింది నాకు.

విషవృక్రం ఇదివరకు మూడు భాగాలుగా ఉండేది. ఇప్పుడు మూడూ కలిపి ఒకటే పుస్తకంగా వేశారు. జానకి విముక్తి కొంచెం కమ్యూనిస్టు(ఈ కారణం చేతనే ఆంధ్రజ్యోతిలో రెండు భాగాల తర్వాత ప్రచురణ ఆపేశారట) ఉపన్యాసాలు ఎక్కువనిపిస్తాయి కానీ నవల బాగానే ఉంటుంది. నేను వెంకట్రావుల్ని పరిశీలించడం అప్పటినుంచే మొదలైంది.

భారతంలో చిన్న కథలు రాసింది వార్తలు చదివే రామకృష్ణ గారే! డౌటక్కర్లేదు.

అంపశయ్య బాగుంటుంది. నవీన్ గారి ఇంటిపేరుగా మారిన నవల. ఆయనది వీలైతే బాంధవ్యాలు కూడా సంపాదించండి.(దొరక్కపోతే నేనున్నాగా)

అమరావతి కథలు ఒక టాప్ క్లాస్ పుస్తకం!

మంచి పుస్తకాలే కొన్నారు.

(ఇక్కడ చదవడానికెందుకూ తొందర అని కొత్త పుస్తకం పెట్టారంటే రాంబాబు పని అయిపోయిందన్నమాటేగా)

24 నవంబర్, 2008 1:26 PMకి

సంతోషం. పోయిన వారం నేనూ ఓ ఐదు పుస్తకాలు కొన్నాను ప్రదర్శనలో.
ముందే చెబితే కలిసి వెళ్ళేవాళ్ళము కదా :-)

25 నవంబర్, 2008 1:43 AMకి

ఆనంద ధార గారు, మీరు చెప్పిన పుస్తకాలలో గణపతి చదివాను. మిగతావి ఈ సారి కొనటానికి ట్రై చేస్తాను.
రవి గారు, ప్రతి సంవత్సరం నవంబర్ చివర్లో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సారి నాకు తెలిస్తే మీకు చెప్తాను లెండి.
లక్ష్మి గారు, చదివి తపకుండ నా అభిప్రాయాలు పంచుకుంటాను
సుజాత గారు, రాంబాబు పని అయిపోయింది. అందుకే కొత్త బొమ్మ కనపడుతుంది.
ప్రవీణ్, ఈ సారి తప్పకుండా కలిసి వెళ్దాం :)

25 నవంబర్, 2008 7:44 PMకి

అబ్బ! మీది భలే అభిరుచి! ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర ఉన్న పుస్తకాలే! ఒక్క శ్రీపాద వారిదీ తప్ప.
రాజా.

1 జూన్, 2012 9:20 PMకి

Joruga Hushaaruga antuu Maajoru ni Pencharu Bagundandi

Teluguwap,Telugu4u,Telugu Downloads,Telugu Peoms,Telugu Dailogs

Tollywood,Tollywood Updates , Movie Reviews

15 ఫిబ్రవరి, 2015 12:09 AMకి
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
18 అక్టోబర్, 2017 2:39 PMకి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి