అత్తగారు - చురకలు  

Posted by దైవానిక

మా అత్తగారు మాంచి హాస్య చతురులు. ఎప్పుడు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కాని ఎప్పుడయినా కాస్త కోపం వస్తే చురకలు భళే వేస్తారు. నాకీ అనుభవం పెళ్ళైన కొత్తలోనే వచ్చింది. ఇప్పటికి ఆ సంగతి గుర్తొచ్చినప్పుడు తెగ నవ్వొస్తుంది. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారి తరుపు బంధువు ఒక ముసలావిడ రోజు మా ఇంటికి వస్తుండేది. ఆ మాట ఈ మాట చెప్పి సుబ్బరంగా ఇంట్లో చేసినవన్ని లాగిస్తూ ఉండేది. మా అత్తగారు పెద్దగా పట్టిచ్చుకునేవారు కాదు. పాపం పెద్దావిడ, కాస్త తిండి యావ ఎక్కువనుకుంటా అనేవారు. ఇంకొన్నాళ్ళకి వంటింట్లోకి దూరి అన్నిటిని వెతికి తినడం ప్రారంభించింది.ఆచారవంతురాలైన మా అత్తగారు, మామూలుగా వంటింట్లో తన మడి వంట సామాన్ని ఎవర్ని ముట్టనివ్వరు. పనివాళ్ళు ఎవరయినా ముట్టుకుంటే ఆ రోజు యుధ్ధమే. ఈ ముసలావిడ అవన్ని ముట్టేసుకొని అంతా కెలికి వదిలేసింది. మా అత్తగారికి చిర్రెత్తుకొచ్చింది. కనుబొమ్మలు రెండు కలసిపోయాయా అన్నంత దగ్గరకొచ్చాయి. నాకు భలే భయం వేసింది. కాని మా అత్తగారు ఏమి అనకుండా ఊరుకున్నారు. హమ్మయ్య అంతా శాంతించింది కదా అనుకున్నాను. ఆ ముసలమ్మ అంతా వెతికి వచ్చి కూర్చుంది. మా అత్తగారు ఏమి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు.
"అమ్మణ్ణీ, ఇదవరికి మధ్యాహ్నాలు ఏము తోచేది కాదే, ఈ మధ్య మీ ఇంటికొస్తున్నానా, బాగా పొద్దుపోతోంది" అందా ముసలావిడ. మా అత్తగారు చురుక్కున ఒక్క చూపు చూసి
"తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందట" అని అన్నారు. అంతే ఆ ముసలావిడ మళ్ళా మా ఇంటివైపు చూస్తే ఒట్టు. అప్పుడు కాస్త మనస్సు చిముక్కుమన్నా తర్వాత మా అత్తగారి చతురతని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
తరువాత మా అత్తగారి అక్క మనవరాలి పెళ్ళికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద యుధ్ధమే జరిగింది. ఎవరో ఒకావిడ కొడుకుని ఇంకికావిడ ఏదో అందిట, అంతే ఆ ముందావిడ, అన్నావిడ వంశం మొత్తాన్ని ఏకి పారేసింది. మూడూర్లకి వినిపించేంత గట్టిగా అరిచి, ఆపడానికొచ్చిన అమ్మలక్కలందరినీ నాలుగు తిట్టి పెట్టే బేడా సర్థుకోని వెళ్ళిపోయింది. మా అత్తగారు అసలే తగువులకి దూరంగా ఉంటారు. అంతా ఒక మూలనుంచి చూసి వదిలేశారు. ఆ తిట్లు పడ్డావిడ కూడా బాగా గుణిగి, తన పరిథిలో తిట్టి బయలుదేరి వెళ్ళింది. ఆ తరువాత మా అత్తగారి అక్క కోడలు వచ్చింది. ఆవిడకి తగువులంటే బహు సరదా అనుకుంటా.. ప్రతి ఒక్కళ్ళ దగ్గరకి వెళ్ళి జరిగిన తగువు గురుంచి తెలుసుకోని, తన గురించి కాస్త డప్పుచెప్తుంది. తను ఏవిధంగా మహా శాంతమూర్తో, అసలు తనకి తగువంటే ఏంటో కూడా తెలియదన్నట్టు మాటలు చెప్పసాగింది. మా అత్తగారు ఇవన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అసలే ఆవిడంటే మా అత్తగారికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఇంతలో ఆవిడ మా అత్తగారి దగ్గరికి కూడా వచ్చింది.
"అవునత్తమ్మా , ఆ పేరందేవి సుబ్బమ్మని నానా తిట్లు తిట్టిందటగా??"
"ఊ"
"అంతా నీముందే! వెళ్ళి ఆపలేకపోయావా!! నేనయితే ఎలాగోలాగ ఆపేదాన్ని, సమయానికి మా ఇంటికెళ్ళాల్సొచ్చింది"
"ఆపినా ఆగే రకమేనా అది??" అన్నారు మా అత్తగారు.
"ఏమోనమ్మా, అసలు నాకు ఈ తగువులంటేనే పడవు. నేనసలు ఎవరి జోలికి పోను. అదికాదత్తా, అసలు ఈళ్ళకి ఈ తగువులెందుకొస్తాయంటావు??" మా అత్తగారి కనుబొమ్మలు మళ్ళా కలిసిపొతాయేమో అన్నట్టుగా తయారయ్యాయి. వెంటనే చురక పడబోతుందనుకుంటూనే ఉన్నా, "జగడమెందుకొచ్చిద్దిరా జంగందేవరా అంటే, బిచ్చమెయ్యవే బొచ్చుముండా అన్నాడంట" అన్నారు మా అత్తగారు. చుట్టుపక్కల అమ్మలక్కలంతా పగలబడి నవ్వారు. కొందరు దీని తిక్క కుదిరిందనుకున్నారు. ఆవిడ ఠక్కున లేచి చురచుర చూసి కోపంతో రుసరూలాడుతూ వెళ్ళింది.

ఇంతలో పెళ్ళి తంతూ అంతా అయ్యింది. ఇంకా ఎవరికి చురకలు పడలేదనే చెప్పాలి. మా అత్తగారి దగ్గర అందరూ కాస్త జాగ్రత్తగా మసులుతున్నారు. ఎందుకొచ్చిన చురకలో అని అనికొనుంటారు. ఇంతలో పెళ్ళి కూతుర్ని గడప దాటించే సమయం రానే వచ్చింది. పెళ్ళి కూతురుది కాస్త భారీ శాల్తీ. ముగ్గరమ్మలక్కలు గట్టిగా తోసినా అంగుళం కూడా కదలట్లేదు. అమ్మలక్కలంతా గదిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మయేమో కొంచెం కూడా కదలట్లేదు. కదలక పోగా, "ఉహూ, నాకు సిగ్గు, నేను వెళ్ళను" అంటూ మెలికలు తిరిగి పోతుంది. మా అత్తగారు వెనకనుంచి అంతా చూస్తూనే ఉన్నారు. ఇలా తతంగం అంతా ఒక పావుగంట నడిచింది. పెళ్ళి కూతురు మాత్రం కొంచెం కూడా కదల్లేదు. మా అత్తగారికి ఒళ్ళు మండినట్టుంది. కనుబొమ్మలు కలుస్తున్నాయి.
" వెనకటికి నీలాంటిది ఇంట్లో మొగుడున్నాడని తెగ సిగ్గుపడి, వీధిలో బట్టలు మార్చుకుందట" అని బిగ్గరగా అంది. వెంటనే అందరు పడిపడి నవ్వారు. పెళ్ళికూతురు తలవంచుకొని మెళ్ళగా లోపలెకెళ్ళి గడిపెట్టింది. మా అత్తగారి సమయస్పూర్తికి, హాస్య చతురతుకు అందరు నాలుగు పొగడ్తలు ఝుళిపించారు.
(సమాప్తం)

ఈ కథని నేను భానుమతి గారి అత్తగారు కథలు చదివి ఇన్స్పైర్ అయ్యి వ్రాసింది. మీకు కథ నచ్చితే ఆ గొప్పంతా, ఆ పాత్ర సృష్టించిన భానుమత్తి గారిదే. నచ్చకపోతే ...

This entry was posted on 13, నవంబర్ 2008, గురువారం at 7:40 PM . You can follow any responses to this entry through the comments feed .

11 comments

కామెంట్లు పనిచేయడం లేదని ఒక హితురాలు చెప్పేవరకు నేను గమనించనే లేదు. ఇప్పుడు పాత స్టైల్ కి మార్చాను. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఉండదనుకుంటాను

14 నవంబర్, 2008 9:25 AMకి
అజ్ఞాత  

bhanumathi gaari "atta gari kathalu " chadavalekapoyinaa
meerilaa mee kathala dwaaara cheppeyandi

baagundi mee ee attagaari katha

14 నవంబర్, 2008 10:06 AMకి

LOL

14 నవంబర్, 2008 5:42 PMకి

భానుమతి గారు , ఆవిడ అత్తగారు ఇది చూశారంటే మీకూ ఒక చురక ఖాయంలా కనపడుతోంది!

14 నవంబర్, 2008 7:54 PMకి
ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
14 నవంబర్, 2008 7:54 PMకి

మీ కామెంట్స్ పోస్టింగ్ లో ఏదో ప్రాబ్లెం ఉందండి. నా కామెంట్ మూడు సార్లు పబ్లిష్ అయింది ఒకే ఒక నొక్కుకి!

14 నవంబర్, 2008 7:59 PMకి

లచ్చిమి, థాంక్సండి, మీకు ఆ పుస్తకం దొరికితే తప్పక చదవండి. చాలా బాగుంటుంది
కొత్తపాళీగారు, నెనర్లు
సుజాత గారు, చురకే మంచిదని వేయించుకుంటాను, అంతకన్నానా!! మీకు కామెంట్లు నాలుగు సార్లు ఎలా వచ్చాయే నాకు అర్థం కావట్లేదు

16 నవంబర్, 2008 2:59 PMకి

బాగుంది :-)

19 నవంబర్, 2008 4:31 AMకి

chaala baagundi..............

29 ఏప్రిల్, 2009 2:44 PMకి

Chaaaalaaaaaaaaa bavundi .....Anni maha saradaga unnai Chaturlu......Ippati vallaki ivi chadivitgegani...Teliyavu...Plz visit our blog also www.teluguvaramandi.net. and share Ur feedback thank u..

16 జనవరి, 2017 2:53 PMకి
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
18 అక్టోబర్, 2017 2:40 PMకి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి