భద్రాద్రి యాత్ర  

Posted by దైవానిక

పోలవరం ప్రాజెక్టు వచ్చేస్తుంది.. ఇక పాపి కొండలు చూడడం భవిష్యత్తులో కుదరదు అని మా అమ్మ గొడవ చేస్తె, గోదావరి/ శ్రీ రామదాసు సినిమాలు చూసినకాడి నుంచి ఎన్నో రోజులుగా భద్రాచల యాత్రకి వెల్లాలనుకుంటున్న కోరిక వలన, మొన్న క్రిస్మస్ సెలవుల్లో భద్రాద్రి యాత్రకు బయలుదేరాము.

ఇక ఒక సుమొ మాట్లాడేసి (గీచి గీచి బేరం చేసి, బేరం లేకుండా పనులు జరుగుతాయా??) మొత్తానికి బయలుదేరాము. అది మా ఊరునుంచి 200 కిలొమీటర్ల దూరం. నాలుగు గంటల ప్రయాణం. గోదావరి సినిమా ఊహించుకుంటూ బయలు దేరాము.సుమో డ్రైవరుగారు కాసేపు గాలిలో పోనిచ్చారు. దాని ప్రభావం వలన టైరు రిమ్ము వంగిపోయింది. అయ్యొ ఆదిలోనే హంసపాదం అని అమ్మ ఒక నిట్టూర్పు విసిరింది. ఏమి కాదు అని చెప్పి, బాగు చేయించుకోని బయలుదేరాము. భద్రాచలం చేరే వరకు మధ్యహ్నం 2 గంటలయ్యింది. కాటెజి తీసుకుందాము అని వెతికాము. కాటెజి చూసిన వెంటనే దిమ్మ తిరిగింది. A/c Cottages బాగానే వుంటాయట. దోమలు ఉంటాయా అని అడిగితె, చాలా ఉంటాయి అని కూడా చెప్పాడు. ఇక లాభం లేదు అని AP tourism Guest house లో బస చేసాము.
భొజనం చేసి పర్ణశాల కు బయలుదేరాము. అది భద్రాచలం నుంచి 40 కి.మి. దూరం. గంట పయినే పట్టింది. అక్కడ ప్రస్తుతము ఉన్న పర్ణశాల, వాల్మికి రామాయణం ఆధారంగా APTDC వాళ్ళు నిర్మించిందట. అక్కడ ఒక గుడి కూడా ఉన్నది. అసలు పర్ణశాల అక్కడ ఉండేదట. పర్ణశాల నుండి కొద్ది దూరములోనే, స్వామి వారి పాదములు నార వస్త్రముల ఆరేసిన అచ్చులు ఉన్నవి. ఇక అవి చూసేసి గౌతమి ఒడ్డున కాసేపు నిల్చోని తిరుగు ప్రయాణం చేసాము. అప్పుడు నేరుగా గుడికి వెళ్ళాము. అక్కడ దర్శనానికి పెద్దగా సమయం పట్టలేదు. ముఖ్యంగా చెప్పవలసినది ఎంటంటే అక్కడ అమ్మవారు స్వామివారి ఒడిలో కూర్చోని ఉన్న విగ్రహం వున్నది. అలాగే రాముడికి నాలుగు చేతులు కూడా ఉన్నవి. భారతావనిలో ఎక్కడ ఇటువంటి రూపము ఉండదట. గుడి ప్రాంగణములోనె భద్రుడి శిరస్సు ఉంది. ఇంకా ఒక museum కూడా ఉంది. museum తప్పక చూడాల్సిందే. రామదాసు చేయించిన అన్ని ఆభరణములు ఉన్నాయి. చింతాకు పతకము, కలికితురాయి, రవ్వల మొలత్రాడు, పచ్చల పతకము అన్ని చూస్తానికి రెండు కళ్ళు చాలలేదు అంటె నమ్మండి. దర్శనానంతరం రూమ్ కి వెళ్లి భొజనం చేసి తరవాత రోజు వెళ్ళే పాపికొండలని ఊహించుకుంటూ కలలలో తేలిపోయాము. చెప్పడం మరిచానండొయ్, పాపికొండల షికారుకి లాంచి టికెట్లు ముందే కొనుక్కొవడం మంచిది. ఎక్కడ బడితే అక్కడ దొరుకుతాయి. అప్పుడప్పుడు రద్దీ వల్ల దొరకవట.

లాంచీలు కూనవరం అనే ఊరు దగ్గర, శ్రీరామగిరి అనే ప్రదేశము నుంచి బయలు దేరుతాయి. అది భద్రాచలం నుంచి సుమారు 60 కి.మి. దూరం. దాదాపుగా 16 లాంచీలు ఒకే సారి బయలుదేరుతాయి. 8 గంటల నుంచి నిండిన లాంచీలు నిండినట్టు బయలుదేరుతాయి. ఉదయం పలహారాలు, మధ్యాహ్నం భొజనం అన్ని లాంచి వాళ్ళే అందిస్తారు. కాబట్టి, చిప్స్ పాకేట్ లాంటివి కొనుక్కు వెళితె సరిపోతుంది. మంచి నీరు కూడ మినరల్ వాటర్ ఇస్తారు. కాబట్టి నీరు కూడ తీసుకు వెల్ల వలసిన అవసరము లేదు. ఇక మా లాంచి అందరికంటె ముందుగా బయలు దేరింది. కాస్త ఒవర్లోడ్ అయింది కూడా. చాలా నెమ్మదిగా వెళ్ళింది. ఇక ఆ కోండల మధ్యన గోదావరిలో ప్రయాణం చేస్తుంటే పట్టలేని ఆనందం. ఇంతలో పలహారాలు రానే వచ్చాయి (పలహారాలు అంటే పెద్ద ఎవో అనుకునేరు, కేవలం ఉప్మా మాత్రమే. ఉప్మాతినని వాళ్ళు వేరే తీసుకువెళ్ళడం మంచిది).

మెల్లగా ఆనందం తగ్గుతుంది. ఎంతసేపు చూసినా అవే కొండలు, అదే గోదావరి. చిరాకు అనిపిస్తున్న సమయంలో, పేరంటాల్ల పల్లి అనే ఊరు వస్తుంది అని, అక్కడ ఒక శివాలయం, జలపాతం ఉన్నాయని announcement వచ్చింది. మల్లి హుషారుగా అనిపించింది. లాంచి కేవలం 45 నిమిషాలు ఆగుతుందని, రాని యెడల వదిలేసి వెళ్తామని కూడా చేప్పారు.

వెళ్ళి శివాలయం చూసాము. ఏంతో ప్రాశాంతంగా ఉంది. జలపాతం గురించి వ్రాయకపోవడమే మంచిది. పెద్దగా వ్రాయడానికి కూడా ఏమి లేదు. ఆ తరువాత లాంచిలో చెప్పిన సమయానికి సరిగ్గా పదిమంది కూడా రాలేదు. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వారు వచ్చారు. మొత్తానికి అనుకున్నా దాని కంటె 45 నిమిషాలు ఆలస్యంగా, ఒక నలుగురు లేకుండా బయలుదేరింది. అప్పటికి దాదాపు 12.30 అయినట్టుంది. ఇంక ఒక పావు గంట లో పాపికొండలు వచ్చాయి. అంతకుముందు వచ్చినవాటికి, వీటికి పెద్ద తేడా ఏమి కనిపించలేదు నాకు. తరువాత ఖమ్మం జిల్లా పొలిమేర వచ్చింది, గొదావరి తు.గో, ప.గో జిల్లాలను వేరు చెసింది. ఇక తిరుగుముఖం పట్టాం. తరువాత ఒక చోట భొజనాల కోసం ఆపారు. ఎమాటకి ఆ మాటె చెప్పాలి, భొజనం అదిరింది. తిరుగు ప్రయాణం లో దొరికన వాళ్ళు దొరికిన చోట కునుకులేసారు. కొంతమంది చోటు కోసం తగువులాడారు కూడా. ప్రపంచంలో ఇంత చెత్త ప్రదేశం లేదని కూడా అనిపించింది.

మొత్తానికి ఎలాగోలా ఒక 4 గంటల తరువాత శ్రీరామగిరి చేరాము. కాని తిరుగు ప్రయాణం ఎంతో విసుగు కలిగించింది. ఇక శ్రీరామగిరి నుంచి ఇంక 5 గంటల తరువాత మా ఊరు చేరాము. సొమ్మసిల్లి నిదురపొయాము. తెల్లవారిన తరువాత ఆ పాపికొండలు అలానే కళ్ళలో మెదిలాయి. విసుగంతా మరిచాము. ఆ రోజు దినపత్రికలో, పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన permission రద్దు చెస్తున్నారని చదివాను. చంద్రబాబు ఇదంతా ప్రభుత్వ అసమర్థతేనని దుమ్మెత్తి పోసాడు.

ఎంతయినా సినిమాలో చూపించినంత వుండదని గ్రహించాను.

This entry was posted on 3, జనవరి 2008, గురువారం at 12:13 PM . You can follow any responses to this entry through the comments feed .

6 comments

Nice.
Thanks for sharing.
Yes .. the reality will not be like shown in movies.
1. The image in the film is processed, to soften the glare, to enhance the contrast, etc.
2. You are in an AC theater - not under a hot sun, breathing whatever air, sweating, hungry so on :-)

However, you need to approach nature on its own terms .. try to be one with it - like a son coming home to mother rather than a visitor to a distant relative .. then your experience will be quite different and mroe fulfilling

11 జనవరి, 2008 6:56 PMకి

ఎంత డల్ గా రాసారు, ఒక మహత్తర సౌందర్య జగత్తు గురించి. అందం చూసే వాళ్ల కళ్లలో వుంటుందని మరో మారు నిరూపితమయ్యింది. మీరు సరైన కంపనీ తో వెళ్లుంటే ఇలా వుండేది కాదేమో. నేనూ చూసాను భద్రాచలం నుంచి పాపికొండలు. నా అనుభూతి, ఆనందం మాటలలో చెప్పలేను. ప్రకృతి ప్రధానమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు నె నెలా అనుభూతి చెందుతానో, తెలుసుకోవాలనుకొంటే చూడండి
http://deeptidhaara.blogspot.com/2007/01/blog-post.html
http://deeptidhaara.blogspot.com/2007/01/2.html

మీకు ఆసక్తి వుంటే, మాతో ప్రకృతి యాత్రలకు రండి.

12 జనవరి, 2008 1:45 AMకి

మరో ట్రావెలాగు టపా! బాగుంది.

1 ఫిబ్రవరి, 2008 3:35 AMకి

ఎవరినైనా కామిస్తే.. వారు నటించిన వస్తు సంఖ్య (ఐటెం నెంబరు) చూడాలి... వీలయితే.
ఎవరినైనా ప్రేమిస్తే, వారిని ఆశ్రయించి మాట్లాడాలి.. వీలయితే.
మీరు గోదావరిని కామించినట్లున్నారు..

టపా చాలా గమ్మత్తుగా వ్రాసారు, బాగుంది చమత్కారం.

8 ఫిబ్రవరి, 2008 11:33 PMకి

అయితే..మీరు లాంచీ మీద పుల్లట్లు తినలేదన్నమాట ;-)

9 ఫిబ్రవరి, 2008 12:39 AMకి

tindi gurinchi raasaru ekkuvaga........akkadi beautiful places kante.............

29 ఏప్రిల్, 2009 3:19 PMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి