ఈ మధ్య చాలా కందాలు చూసి నాక్కూడా వ్రాయలని ఎందుకో అనిపించింది, లేడికి లేచిందే పరుగ్గా ఠకఠక వ్రాసేసాను(అంటే ఒక్కోదానికి ఒక గంటపయినే పట్టింది). అసలు కందము వ్రాయగల్గడమే ఒక వరము. ఒక్కసారి మొదలెట్టామో ఇక వరసగా అన్ని కందాలే. కాందాలు వ్రాయడానికి రూల్స్ కావాలంటె ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. చూస్తానికి చాలా కష్టమయిన రూల్స్ లా అనిపించినా, వ్రాసినప్పుడు అనుకున్నంత కష్టము(అంటే చాలా కష్టం కాకుండా, కొంచెం కష్టం అని) కాదేమో అనిపిస్తుంది.
సర్వ భగాణాలంకృతమైన కందమును నే కూడా కాస్త పొగిడితే ఇదుగో ఇలాగే ఉంటుంది
కందము నందము జూచితి
నందము బ్లాగున్, చిటుకున నల్లరి పదముల్
చిందర వందరగ మదిన్
తొందర పెట్టిన విధము నె తొరపడి బల్కెన్
కందమనగానే మనకి సుమతి శతకము గుర్తు రావాలి. నీతి ఎంత చక్కగా కందంలో ఉంటుందో చూస్తె, మనక్కూడా కొన్ని నీతులు చెప్పలనిపీయడం ఖాయం. అలా నీతులు చెపితే ఇదుగో ఇలా
చెప్పిన మాటలు మరలున
జెప్పిన తడవే విరివిగఁ జెప్పులు విసురున్
గొప్పలు మెండుగ బల్కిన
తిప్పలు తప్పక బడబడ తిట్టును జనులున్
పై రెండు రాసాక ఇంకా వ్రాయాలన్న తృష్ణ( అది చాలా పెద్ద పదమేమో, కోరిక అంటె సరిపోదు) చావక ఇదుగో ఇలా బయట పడింది.
మెడలో బంగారు గొలుసుఁ
జడలో చామంతి పూలుఁ జక్కగ పెట్టిం
గుడిలో కనపడెఁ , పిమ్మట
వొడిలో పసికందు జూచి వుడికెను మనసున్
అక్షింతలు వేయించుకోడానికి సిద్ధముగా ఉన్నానోచ్..
11 comments
కందారంగేట్రాభినందనలు.
అభ్యాసం కూసు విద్య.
:-)
శుభం. పద్యసారస్వతలోకానికి సుస్వాగతం.
మీక్కూడా కందపుటీగ కుట్టేసిందన్న మాట .. ఇహనేం!
సంతోషం!!
కందారంగేట్రం, కందపుటీగ ... కందపదకోశం తయారయిపోతోంది! దైవనిక గారూ! అందుకోండి మరి కందాభినందనలు!!
రామకృష్ణ గారు, కందం బాగుంది కాని, పదాల మధ్యలో అలా అచ్చులు రావచ్చా?? సంధి జరుగుతుందేమో కదా!!
రానారె గారు, రాఘవ గారు, ధన్యవాదాలు
కొత్తపాళి గారు, కుట్టడమే కాదు, మాటి మాటికి నోట నానుతుంది కూడా
చంద్రమోహన్ గారు, నా ఈ ఉత్సాహానికి తమరి టపానే కారణమని చెప్పాలి :)
వికటకవి గారు, థాంక్సండి.
శా: -శ్రీ దైవానిక ! మీదు ప్రశ్న బహుధా శ్రేయంబు, యోగ్యంబునౌన్.
బోధింతున్ గుణ దోషముల్ వినుడు. సత్ పూజ్యాప్పకవ్యాదులే
మోదం బొప్ప వచించె కావ్య గతులన్. మున్ముందు సద్ గ్రాహ్యమౌన్.
క్రోధంబొందకుడింతలోనె. కృపతో కూర్మిన్ ననున్ గాంచుమా
నేను వ్రాసిన కంద పద్యము మీ మెప్పు పొంద గలిగి నందుకు సంతోషం. ఐతే పద్యం మధ్యలో సంధి జరపకుండా అచ్చులు వాడవచ్చునా అని అడిగారు. నిజమే. మీరన్నది " విసంధికము " అనబడే ఒక దోషం. ఇతే సమాసములలో సంధి చేయకుండా ప్రయోగిస్తే అది దోషం.సమసించనప్పుడు దోషం కాదు.నిత్య సమాసాలలో అది వర్తిస్తుంది.
మీకు సులభ గ్రాహ్యమవడానికని అలా వ్రాశాను. అదే పద్యం ఇప్పుడు చూడండి.
క:-కందము వ్రాసిరి. మెచ్చితి
నందంబగు పదములెన్ని, యమరిక జేయన్,
కందము మనకందంబై
సుందరముగనుండుగాదె, సూనృత హృదయా !
ఈ పద్యంలో నకారాన్ని, ధృతము కావున గ్రహ్నిచుకోవచ్చు. 2వ పాదంలో అసమాపక క్రియకు ససంధి కారాదు కాన యడాగమం వస్తుంది. మీకర్థమయేలా చెప్పాననుకొంటున్నాను. మీ ఆసక్తికి నా ఆనందన్ని వ్యక్తం చేస్తున్నాను. నమస్తే.
చింతా రామకృష్ణా రావు
ఆంధ్రామృతం.
మీ కంద పద్యాలు చాలా బాగున్నయి.
సాధన చేస్తే ఇంక చాలా బాగా రాయ గలరు.
దయ చేసి మరి కొన్ని పద్యాలు రాసి మమ్మల్ని ధన్యుల్ని చెయగలరు.
భవదీయుడు
కాముధ
తేటగీతి గారు, ధన్యుడ్ని
కముధ గారు, త్వరలో మీ మీద కుప్పలు కుప్పలుగా విసరదల్చాను పద్యాలు. యిక కాసుకోండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
బూజు దులుపండి
వీడెవడండి బాబు
- దైవానిక
- సూర్యుని కిరణం నేను, సముద్రపు అలను నేను, నింగిలోని పక్షిని నేను, నేలలో వృక్షం నేను, గాలిలో సువాసన నేను, అగ్నిలో సెగను నేను, ఉరుములో శబ్దం నేను, దీపపు వెలుగుని నేను, అన్ని కలిపి దేవతల దండుని నేను.
నేడే చూడండి!!
-
డిజర్వేషన్లు ఇస్తే చలితులు మతం మారరు. అవునా? – 102 నెలల క్రితం
-
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల6 నెలల క్రితం
-
Ashray5 సంవత్సరాల క్రితం
-
కొసమెరుపురచయిత ఓ హెన్రీ ఇంట్లో కాసేపు ....10 సంవత్సరాల క్రితం
-
కొబ్బరి చిప్ప .... శాపం12 సంవత్సరాల క్రితం
-
నవంబరు గడి16 సంవత్సరాల క్రితం