జీవనతరంగాలు (కొత్తపాళి గారి కథావిషయం)  

Posted by దైవానిక

కోత్తపాళి గారి కథావిషయం ఆదారంగా వ్రాసిన కథ.
_________________________________


మయూర్ ట్రైన్ ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. మనిషి అక్కడున్నాడన్న మాటే గాని మనస్సెక్కడో ఉంది. తను ఇంటికి వెళ్తున్నాడు, పెళ్ళిచూపులకి. వాళ్ళ అమ్మా నాన్న పోరు పడలేక పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడొ లేదొ, ఒక అరడజను పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారు. ఎందుకో మొదటినుంచి అతనకి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. ఇవ్వాళ జరిగిన దాన్ని తలచుకుంటే, తన నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తుంది ప్రస్తుతానికి. ట్రైను కదిలింది. మెల్లాగా వెనక్కి ఒరిగాడు. అతనికి తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి.

ఇంటికి వెళ్తానికి మయూర్ ఆఫీసులో బయలు దేరాడు. రోడ్డు మీదకు వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుంటే, ఒక ఆటొవాడు అతని మీదకు వచ్చి ఆపాడు. సడన్ గా వెనక్కి జరిగడంతో ఆటో కి అతని కాలి వేలికి మధ్యలో ఒక అంగులం గాప్ మిగిలింది.
"ఎంటి బాబు ఆ తోలడం, ఆటో అనుకున్నావా లేక విమానమనుకున్నావా?" అన్నాడు అందులో కూర్చున్న వ్యక్తి.
మయూర్ కి ఇదంతా అలవాటే. అందుకే అతని సిక్స్త్ సెన్స్ వెనక్కి వేళ్ళమని చెప్పింది. పాపం ఆటోలో కూర్చున్న వ్యక్తి ఎప్పుడు ఆటో ఎక్కలేదనుకుంటా. అతని బిత్తర చూపులు చూస్తుంటేనే అర్థం అయ్యింది.

ఆటో కదిలి కాస్త దూరం వేళ్ళి ఆగింది. అది లేబర్ కాలని. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు.
"అన్న టషన్ కి వత్తవా?" అన్నది కాస్త పెద్దగా వున్నావిడ.
"ఉ"
"ఎంతయితది?"
"ఒక్కొక్కళ్ళకి ఏడు రుపాల్"
" అయిదు తీసుకోరాదు?"
" అమ్మా ఈడ బేరాలుండవు.. ఎక్కుతె ఎక్కు లేకుంటే లే"
" గట్ల గురాయిస్తవేందన్న? ఎక్కు బిడ్డా."
చిన్నావిడకి పట్టుమని 14 ఏళ్ళుకూడా ఉండవు. పేద్దావిడకి ఒక 35 ఉంటాయనుకుంటా. ఇద్దరు ఆటో ఎక్కి కూర్చున్నారు. ఆటో కదలబోతుంటే ఇంకొక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆటో ఆపి ఎక్కాడు. పల్లెటూరు వాడిలా ఉన్నాడు.
ఆటో తమ్మి మళ్ళి గాలిలో వెళ్ళడం మొదలెట్టాడు. ఆ పెద్దావిడ ఎదో మాట కలపబోతుంటే చటుక్కున తల తిప్పేసుకున్నాడు మొదటి నుంచి కూర్చున్న పెద్దమనిషి. ఇక చేసేది లేక ఆవిడ మయూర్ తో బాతాఖాని మొదలెట్టింది.
" తమ్మి మీది హైద్రాబాదేనా"
"అవునండి"
"మాది చింతకాని. ఈడ నుంచి టేషన్ కు ఎంతసేపు పడతది?"
"ఇంకోక పావు గంట నుంచి - అరగంట దాకా పట్టోచ్చునండి."
"ఈడ మా సెల్లి ఉంది. దానికి ఆరుగురు బిడ్డల తర్వాత కొడుకు బుట్టిండు. చూడనీకి వచ్చినా"
"ఆరుగురు ఆడపిల్లలా???"
" అవును తమ్మి .. మళ్ళా కొడుకుండాల కదా"
"దేనికి"
"అదేంది తమ్మి గట్లంటవు... తర్వాత అన్ని చూసేడిది ఆడె గదా"
" ఏంది చుసేడిది... మన సావా?" అన్నాడు ఇప్పటిదాకా వింటున్న పల్లెటూరాయన. అతని కళ్ళలో కోపం ఉట్టి పడుతూంది.
"గదేందన్నా కన్న కోడుకు సావెందుకుచూస్తడు"
"ఈ కోడుకులకు కావల్సింది ఆస్తులు గాని మనుషులు గాదమ్మ. నేను కూడ నీ తిరుగనే ఆలొచించేటోన్ని. నాకు ఇద్దరు బిడ్డలు,ఒక్క కోడుకు. బిడ్డలకిస్తే పాపం కోడుక్కి ఆస్తి మిగల్దని వాళ్ళని ఊరికనే దారిన బోయేటోల్లకి ఇచ్చి పెండ్లి జేసినా.. ఉన్నదంతా కోడుక్కి ఇస్తే ఆడేమి చేసినడొ ఎరుకనా"
"ఎం చేసినాడన్నా?"
"ఉన్న రెండెకరాలు వాడి పేరున రాయించి, ఇంట్లకెళ్ళి బయటకు గెంటిండు. ఏడకి పోయేడిది లేక కూతురు కాడ చేరినా.. పాపం బిడ్డల పరిస్థితి గంతంతగనే ఉన్నది"
మయూర్ కి అతన్ని చూస్తే జాలేసింది. ఇంతలో ఆవిడే మళ్ళా మాట్లాడింది.
" అన్న ఇప్పుడు ఏడికి పోతున్నవ్?"
" నా కోడుకు తో తగాదా చేసెటీనికి. ఆ రెండెకరాలు ముగ్గురు సమానంగా కావాలి అని ఆడిగేదానికి. లేకుంటే కోర్టుకి పోతా.."
అప్పటి దాకా ఒక మూల నుంచి అంతా వింటున్నాయన ఒక్కసారిగా బోరున ఏడ్చాడు.
"అయ్యొ బిడ్డా" అని పక్కన చేరి ఓదార్చడానికి చటుక్కున వేళ్ళింది ఆ పెద్దావిడ.
మయూర్ , "ఏమయ్యింది సర్? ఎందుకు ఏడుస్తున్నారు?"
" ఆ పెద్దాయన తన కోడుకు గురించి చెప్తుంటే నాకు ఎందుకో మా అమ్మ గుర్తోచ్చింది"
"అయ్యొ, ఏడ్వడం ఎందుకు, మీ అమ్మ ఏడుండది?" అన్నది ఆ పెద్దావిడ.
"చచ్చిపోయింది.. కాని నేను మా అమ్మ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. చిన్నాప్పుడె మా నాన్న చనిపోతే, నన్ను ఎంతో కష్టపడి పెంచింది మా అమ్మ. చుట్టాలు, పక్కాలు ఎవ్వరు మమ్మల్ని ఆదుకోలేదు. అయినా మా అమ్మ ఎప్పుడు దిగులు పడలేదు. నన్ను ఇంజినేరింగ్ దాకా చదివించింది. "
" తరువాత?" అడిగాడు మయూర్.
"తరువాత నేను అమెరికా వెళ్తాను అన్నాను. మా అమ్మ వారించింది. ఇక్కడె ఉండమంది. అక్కడికి వెళ్తె ఇక నాతో చెల్లంది. నేను ఏమయినా వెళ్తానన్నాను. తరువాత మా అమ్మే సర్దుకుంటదిలే అనుకున్నాను. కాని నాతో మళ్ళా మాట్లాడలేదు. నేను కూడా ముసల్దానికి వయసయితె తిక్క కుదిరిద్దిలే అని పట్టించుకోలేదు." అంటూ మళ్ళా కళ్ళు తుడుచుకున్నాడు.

"కాని మా అమ్మ నన్ను మళ్ళి ఎప్పుడు మాట్లాడించలేదు. కనీసం తన ఆఖరు క్షణాల్లో కూడా చూసే అవకాశం కలగలేదు. నేను మా అమ్మ మాట కోసం ఇప్పుడు తిరిగొచ్చేసాను. నేను సంపాదించిందంతా పెట్టినా మా అమ్మని తిరిగి పోందలేను. అందుకే నా ఆస్తంతా పెట్టి మా అమ్మ పేరున ఒక చారిటబుల్ ఇంస్టిట్యుట్ మొదలెట్టాను. ఆ పని మీదే ఊరెళ్తున్నాను"
కథ విని అంతా గమ్మున కూర్చున్నారు. అంతలో ఆ చిన్నావిడ అంది,
" అమ్మ నేను కూడా గా తాగుబోతోన్ని పెళ్ళీ చేసుకోను"
"మన కులం లో తాగనోడు ఎవడు బిడ్డా? అయునా పెండ్లి చేసుకోక ఏమి చేస్తవ్?"
"మంచిగా చదువుకోని మిమ్మల్నందరిని బాగా చూసుకుంటా"
"చదవినీకి మన దగ్గర ఏమున్నది బిడ్డా? "
"అమ్మా మీకు అభ్యంతరం లేకపోతె మీ బిడ్డని నేను చదివిస్తా" అన్నాడు ఆ పెద్దమనిషి.
"నేను ఒప్పుకున్నా నా పెన్విటి ఒప్పుకోడు తమ్మి.."

అంతలో స్టేషన్ వచ్చింది. అందరు దిగారు. ఎవ్వరి దారిలో వారు బయలుదేరారు.
***************** సమాప్తం****************

This entry was posted on 20, ఏప్రిల్ 2008, ఆదివారం at 3:02 PM . You can follow any responses to this entry through the comments feed .

6 comments

బాగుందండి.కధలో మంచి విషయాన్ని చర్చించారు.కానీ కళ్ళు మూసుకుని గతంలోకెళ్ళిన హీరోని వర్తమానంలోకి తీసుకొచ్చి వదిలేసుంటే కధకి కాస్త పూర్ణత్వం వచ్చేదేమో?

21 ఏప్రిల్, 2008 3:14 AMకి

బాగుందండి కధ!

21 ఏప్రిల్, 2008 1:20 PMకి

రాధిక గారు, చదివి వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు. ఇంకా వర్తమానంలో చెప్పడానికి ఏమి లేక అలా ఆపెయ్యవలసి వచ్చింది. దాని గురించి ఆలోచించి ఏమన్నా మార్పులు చేయగలనేమో చూస్తాను.
రమణి గారు, నెనర్లు.

21 ఏప్రిల్, 2008 4:09 PMకి
అజ్ఞాత  

అసంపూర్తిగా ముగిసింది.
అరే, గడువు దాటిపోయిందిగా!
పరిశీలనకు పంపారా?

21 ఏప్రిల్, 2008 4:50 PMకి

Netijen గారు, చదివినందుకు నెనర్లు. ఇది నిన్నే పరిశీలనకు పంపేసా. అసంపూర్ణం గురించి ఒక్క విషయం చెప్దామనుకున్నా,
నాకు ఎంతో ఇష్టమయిన రచయితలలో రోలింగ్ ఒకరు. ఆవిడ, హారి పోట్టర్ పూర్తి చేసాక ఆవిడని ఒక ప్రశ్న అడిగారు చాలామంది. చాలా Loose Ends ఉన్నాయేమి అని. అప్పుడామే, "రచయితకి తెలిసిందంతా ఎప్పుడు చెప్పకూడదు. కొంత చదివే వాళ్ళ imagination కి వదిలెయ్యాలి. అంతా నేనే చెప్పేస్తే ఇంక ఆసక్తి ఎముంది" అని సమాధానం ఇచ్చింది. ఆ వాక్యమే నా మనస్సులో దృడంగా ముద్ర పడింది. దాని ప్రభావమే ఈ అసంపూర్ణం అనుకుంటా :-)
వ్రాయడానికి క్రొత్త వల్ల కూడా అయివుండవచ్చు.

21 ఏప్రిల్, 2008 5:25 PMకి

ఈ అసంపూర్ణం మీరన్న రౌలింగ్ ప్రభావం కంటే కూడా...మీరు చెప్పిన రెండో కారణం (వ్రాయడానికి కొత్త) వల్ల ఏమో అనిపిస్తోంది. కథ బాగా చెప్పారు... కానీ... అలా ఉన్నట్లుండి ముగించడం అన్యాయం. Good luck for ur future stories. :)

22 ఏప్రిల్, 2008 7:45 AMకి

కామెంట్‌ను పోస్ట్ చేయండి