నాకు నచ్చిన పద్యాలు  

Posted by దైవానిక

ఈ మధ్య నేను పద్యాల్నే చదువుతూ, తింటూ, పద్యాల్నే కలలు కనడం, వ్రాయడం కూడా జరిగుతుంది. నాకేమన్నా పద్యపైత్యం పట్టుకుందేమో అని అనుమానంగా కూడా ఉంది. పత్యం చేసి పైత్యం తగ్గేలోపే, నాకు నచ్చిన ఆ నాలుగు పద్యాలు నెమరు వేసుకుంటే పోతుందనే ఒక అద్భుతమైన ఐడియా బుర్రలోకొచ్చింది.
పద్యమంటే, ఎప్పటికీ మర్చిపోలేని పద్యం ఒకటుంది. శ్రీనాథుడు వ్రాసిన చాటుపద్యం. చాటుపద్యాలు చెప్పడమే నా దృష్టిలో చాలా గొప్ప. నేను, ఈ పద్యం చెప్పేముందు ఒక పిట్ట కథ చెబుతాను. అది శ్రీనాథుడు జీవిస్తున్న కాలం( సంవత్సరం సరిగ్గా గుర్తులేదు).ఏంటో ఏ ఊరో కూడా గుర్తురావట్లేదు సుమా! శ్రావణ మాసం దాటింది, అయినా వానలు లేవు. భాద్రపదం, ఆశ్వయుజం కూడా దాటాయి, వాన జాడ మాత్రం తెలియలేదు. ఇక లాభం లేక "డ్రాట్" అని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. తాగడానికి కూడా నీరు లేక పిల్ల-జల్లా, గొడ్డు-గోద అంతా అలమటిస్తున్నారు. భీభత్సమైన పరిస్థితి, క్షామం అన్నిచోట్లా భరతనాట్యం చేస్తోంది.( మన శాస్త్రీయ నృత్యం కూచిపూడి అనుకుంటున్నారు కదా! మరి క్షామానికి భరతనాట్యానిది పెద్ద అనుబంధమే). అలాంటి సమయంలో మనస్సును ఉత్తేజపరిచే చాటు పద్యం చెప్పడం కవి సార్వభౌమునికే చెల్లింది. సరే ఇక ఆస్వాదించండి.

కం॥ సిరిగలవానికి జెల్లును
తరుణుల పదియారువేల దగ పెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్

సిరినే తన వశం చేసుకున్నా ఆ శ్రీకాంతుడు పదహారు వేల మందిని పెళ్ళి చేసుకున్నాడంటే అర్థం ఉంది. రోజు బిక్షాటన చేసే జంగందేవరవి, నీకెందుకయ్యా ఇద్దరు పెళ్ళాలు. చాలు చాల్లేగాని గౌరమ్మని నువ్వుంచుకొని, గంగమ్మని పంపవయ్యా!! ఇది శ్రీనాథుని భావం. ఇది విన్నాక పరమశివుడైనా మరెవరైనా ఆనందంచి గంగమ్మని పంపకుండా ఊరుకుంటారా??

ఇక పద్యాం అంటే నాకు గుర్తొచ్చే రెండో పద్యం ధూర్జటి కవి వ్రాసింది. కాస్త వైరాగ్యం, కాస్త భక్తి కలిగిన పద్యం. ప్రపంచంలోనే అతి పెద్ద వింతని(7 వండర్స్ లో లేదులెండి) చక్కగా రూచి చూపే పద్యం. శార్థూలంలో ఛందంగా ఉంటుంది.

శా॥ అంతా మిథ్య తలంచిచూచిన, నరుండట్లౌటెరింగిన్ సదా!
కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
బ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు తాఁ
చింతాకంతయు చింతయుంచడు కదా శ్రీకాళహస్తీశ్వరా!

ఎప్పటికో ఒకప్పుడు పుటుక్కుమంటానని తెలిసి కూడా మానవుడు, భార్య, పిల్లలు, శరీరం, డబ్బులు అన్న బ్రాంతిలోనే ఉంటాడుకాని, అన్నిటికి మూలమైన నీయందు కొంచెం శ్రద్ద కూడా చూపించడయ్యా ఓ ఈశ్వరా! ఇది ఆ పద్యభావం. చిన్నప్పుడు చదివినప్పుడు పెద్దగా అర్థమవ్వకపోయినా ఇప్పుడు కాస్త అయినట్టే ఉంది. అయికూడా నేనింకా అలాగే ఉన్నా!!

తెలుగుకి కాస్త విరామం ఇచ్చి దేవభాష వైపు మళ్ళిద్దాము దృష్టిని. అసలు ఈ పద్యం చెప్పాక తెలుగుకి, సంస్కృతానికి ఎంత సామ్యముందో తెలుస్తుంది. ఈ పద్యాన్ని బర్తృహరి వ్రాసాడు. విద్య విషిష్టతని చెప్పే పద్యము. ఈ పద్యాలనే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించాడు. ఇప్పుడు రెండు పద్యాలు వినిపిస్తాను. రెండిటిలో ఎంత తేడా ఉందో చూడొచ్చు.

శా విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యాభోగకరీ యశస్ సుఖకరీ విద్యా గురూనాం గురు
విద్యాబంధుజనే విదేశగమనే విద్యా పరా దేవతా
విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన: పశు:

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఇదిగో,
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశబందుడున్,
విద్య విశిష్ట దైవతము , విద్యకు సాటి ధనంబులేదిలన్
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగని వాడు మర్త్యుడే!!

పై రెండు పద్యాలలో ఎన్నో ఉపమా అలంకారాలున్నాయి. లక్ష్మణ కవి ఎన్ని ఉపమానాలని మార్చాడో చూడండి. తెలుగు ఉచ్ఛారణలోను, వాడుకలోను సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుందనడానికి చక్కటి ఉదాహరణ.
మొత్తం మూడు పద్యాలు తలుచుకున్నంతలోనే ఇంత పెద్ద వ్యాసం అయిపోయింది. ఇంక నాకు ఎంతో ప్రీతిపాత్రుడైన పోతరాజును తలుచుకోనే లేదు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంతే, ఈ పైత్యం తగ్గక పోతే ఇంకో రెండు మూడు పార్ట్ లు వచ్చే అవకాశం ఉంది.